తెలంగాణ లో కీలకంగా మారిన రాజకీయాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి ఓవైపు ఆలోచిస్తునే అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీపైన కూడా ఆయన ఓ కన్నేసి ఉంచినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగేందుకు ఆ పార్టీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 38 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ బొటాబొటి మెజారిటీతో మాత్రమే అధికారంలోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం చాన్నాళ్లు ఉండదని.. ఏడాది తిరగకముందే కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి.. తమ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికుందో చెప్పాలని.. తమ సర్కార్ ను టచ్ చేసి చూడాలని సవాల్ విసురుతూ వస్తున్నారు. అదే సమయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి తమలో కలుపుకోవాలనే ఆలోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి.

తెలంగాణలో ఎమ్మెల్యేలను చీల్చడం కొత్తేమీ కాదు.. 2014లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ పలువురు ఎమ్మెల్యేలను తమలో కలిపేసుకుంది. టీడీపీ తరపున గెలిచిన 12 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, వైసీపీ నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరి చొప్పున ఎమ్మెల్యేలను లాగేసుకుంది. అలాగే 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున 19 మంది గెలిస్తే 12 మందిని లాగేసుకుంది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరితో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్లను కూడా లాగేసుకుంది. తగినంత బలం ఉన్నా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాగేసుకోవడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.

ఇప్పుడు ఇదే స్కెచ్ అమలు చేయాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి మూడింట రెండొంతుల మందిని లాక్కోవడం ద్వారా ఫిరాయింపుల చట్టం వర్తింపజేయకుండా ఉండేలా రేవంత్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ కు ఉన్న 38 మందిలో 26 మందిని చీల్చితే ఫిరాయింపుల చట్టం వర్తించదు. ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. మరో 22 మంది ఎమ్మెల్యేలు కారు దిగేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. దీంతో 25 మంది అవుతారు. మరొకరిని కూడా లాగగలిగితే ఫిరాయింపులు చట్టం వర్తించకుండా సేఫ్ గా బయటపడొచ్చు.

అయితే ఇలా బయటికొచ్చే ఎమ్మెల్యేలను పార్టీలో కలుపుకోవాలా.. లేకుంటే బీఆర్ఎస్ వ్యతిరేక గ్రూపుగా గుర్తించి ప్రతిపక్ష హోదా కట్టబెట్టాలా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఎక్కువమంది ఎమ్మెల్యేలు విలీనానికే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ప్రత్యేక గ్రూపుగా ఉంటే భవిష్యత్తులో తమకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని వాళ్లు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. విలీనమైతే కాంగ్రెస్ పార్టీలో తమకు భవిష్యత్తుకు ఢోకా ఉండదని చెప్తున్నట్టు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.