టీ కాంగ్రెస్‌లో పొంగులేటి, జూప‌ల్లి చేరిక తుఫాన్‌!..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: టీ కాంగ్రెస్ అంటేనే అంత‌ర్గ‌త కొట్లాట‌లు.. ప‌ద‌వుల కోసం పాకులాట‌లు.. సొంత పార్టీ నాయ‌కుల‌పైనే అల‌క‌లు.. లుక‌లుక‌లు. ఇప్పుడు ఆ కొట్లాట ఢిల్లీకి చేరింది. మ‌ళ్లీ పాత‌క‌థే తెర‌మీద‌కి వ‌చ్చింది. బీఆర్ఎస్ బ‌హిష్క‌త నాయ‌కులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావుస‌హా మ‌రికొంద‌రు సోమ‌వారం ఢిల్లీ రాహుల్‌గాంధీతో స‌మావేశం కాగా, వారికి వ్య‌తిరేకంగా అప్పుడే కాంగ్రెస్ మార్క్ గ్రూప్ రాజ‌కీయాలు ఊపందుకొన్నాయి. వీరి చేరిక‌పై తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరెవరు ఏమనుకుంటున్నారు చూస్తే ..వీరి చేరిక‌పై తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న ఖ‌మ్మం ఫైర్‌ బ్రాండ్ రేణుకా చౌద‌రి..ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో స‌మావేశ‌మ‌య్యారు. కేంద్ర మాజీమంత్రి అయిన త‌న‌కు చెప్ప‌కుండానే పొంగులేటిని పార్టీలో ఎలా చేర్చుకుంటార‌ని అసంతృప్తి వెళ్ల‌గ‌క్కారు. త‌మ స్వార్థం కోసం కాంగ్రెస్‌ను ఉప‌యోగించుకోవాల‌నుకునే వారికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌ర‌మేంట‌ని ఠాక్రేను నిల‌దీశారు. ఇక టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ అయి ఇదే విష‌యంపై పెద‌వి విరిచిన‌ట్టు తెలిసింది. ఇదిలా ఉంటే..కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఢిల్లీకి వెళ్లిన పొంగులేటి, జూప‌ల్లిని టీ కాంగ్రెస్‌లోని కొంద‌రు నాయ‌కులు ద‌గ్గ‌రుండి మ‌రీ రాహుల్‌గాంధీతోపాటు ప్రియాంక‌గాంధీని కూడా క‌లిపించారు. రాహుల్ ఒక్క‌రినే క‌లిస్తే స‌రిపోతుంద‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పినా..ఆయ‌న వ్య‌తిరేక గ్రూపు నాయ‌కులు కావాల‌నే త‌మ క్రెడిట్ కోసం ప్రియాంక వ‌ద్ద‌కూ ఆ ఇద్ద‌రిని తీసుకెళ్లార‌ట‌. ఈ ఇద్ద‌రి చేరిక సంద‌ర్భంగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల‌యంలో రేవంత్ వ్య‌తిరేక వ‌ర్గీయులు చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాద‌ట‌. పొంగులేటి, జూప‌ల్లి చేరిక‌లో రేవంత్‌రెడ్డి ప్ర‌మేయం కంటే త‌మ కృషే ఎక్కువుంద‌ని చెప్పుకొనేందుకు సీనియ‌ర్ నేత‌లు మధుయాష్కీ, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి తెగ బిల్డ‌ప్ ఇచ్చార‌ని రేవంత్‌రెడ్డి వ‌ర్గీయులు వాపోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.