ప్రగతిభవన్‌కు ప్రభాకర్ రెడ్డి..సీఎం కేసీఆర్‌తో కీలక సమావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రగతిభవన్‌కు బయలుదేరారు. మధ్యాహ్నాం 3 గంటలకు సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు మంత్రి జగదీష్ రెడ్డి, నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్‌ను కలవనున్నారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలో గెలిచి ఎమ్మెల్యే కానున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగానే కేసీఆర్‌ను కలుస్తున్నారని తెలుస్తోంది. ఉపఎన్నికలో గెలిచేందుకు కూసుకుంట్లకు కేసీఆర్ అభినందనలు తెలపనున్నారు.

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ను గెలిపించినందుకు జిల్లా మంత్రిగా ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ ధన్యవాదాలు తెలిపే అవకాశముంది. మునుగోడు ఉపఎన్నికకు టీఆర్ఎస్ ఇంచార్జ్‌గా మంత్రి జగదీష్ వ్యవహరించిన విషయం తెలిసిందే. మునుగోడు గెలుపు బాధ్యతలను ఆయన తన భుజాలపై వేసుకున్నారు. కూసుకుంట్లకు టికెట్ ఇప్పించడం దగ్గర నుండి గెలిపించే వరకు వ్యవహారాలన్నీ ఆయనే చూసుకున్నారు. కేసీఆర్ దగ్గర నుంచి వచ్చే వ్యూహలు, సూచనలు, ఆదేశాలను సెగ్మెంట్‌లో ఎప్పటికప్పుడు జగదీష్ రెడ్డి అమలు చేశారు.

ఇప్పటికే కూసుకుంట్లకు టీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. మంత్రి కేటీఆర్‌తో పాటు హరీష్ రావు ట్విట్టర్ ద్వారా కూసుకుంట్లను అభినందించారు. కూసుకుంట్లకు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపిన కేటీఆర్.. ఇచ్చిన హామీ ప్రకారం మునుగోడును దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు కూసుకుంట్లను స్వయంగా ప్రగతిభవన్‌కి పిలిపించుకుని కేసీఆర్ అభినందించనున్నారు. టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసిన మంత్రి జగదీష్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.