మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ ఆక్షేపనీయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడులో బీజేపీకి ఓటమి తప్పదని, అందుకే ఆ పార్టీ అడ్డదారులు తొక్కుతుందని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు ఇది ఒక మరో తార్కణమని ఆయన తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్‌ పైన భారతీయ జనతా పార్టీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందని ధ్వజమెత్తారు.2011లోనే సస్పెండ్ చేసిన రొడ్డు రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమే అని పేర్కొన్నారు. గతంలో తమ అభ్యర్ధన మేరకు రోడ్డు రోలర్ గుర్తును తొలగించి, మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో రోడ్డు రోలర్‌ను తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పారు. తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందే కుటిల ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుందని నిప్పులు చెరిగారు.ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగబద్ధ సంస్థలను తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అఫీసర్ బదిలీపైన ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ జాతీయ నాయకత్వంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పని చేస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.