19న తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 19న ప్రధాని తెలంగాణలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రూ.7వేల కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.19వ తేదీ ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రతిష్టాత్మక వందేభారత్ ట్రైన్ ను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. రూ.699 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధికి భూమిపూజ చేస్తారు. రూ. 1,850 కోట్ల వ్యయంతో 150 కి. మీ. ల పొడవున నిర్మించనున్న 3 జాతీయ రహదారి ప్రాజెక్టుల విస్తరణ పనులకు భూమిపూజ చేస్తారు. రూ. 521 కోట్ల వ్యయంతో కాజీపేట్ నందు నిర్మించనున్న ‘రైల్ పీరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాపునకు’ భూమిపూజ చేస్తారు. రూ. 1,410 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ మధ్య 85 కి.మీ. ల పొడవున నిర్మించిన డబుల్ లైన్ జాతికి అంకితం చేస్తారు.ఐఐటీ హైదరాబాద్‌లో రూ. 2,597 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు నిర్మాణాలను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. అదే రోజున పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.క్రితం సారి ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయన్ను కలుసుకోలేదు. ఈ సారి కూడా కలుస్తారా అనేది అనుమానమే. ఈసారి కూడా కేసీఆర్ మొహం చాటేస్తారని సమాచారం. ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులా ఉన్నాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసు, ఢిల్లీ మధ్యం పాలసీ స్కామ్‌ కేసులతో రెండు పార్టీల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా దెబ్బతిన్నాయి. దీనికి తోడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేసీఆర్ ప్రధానిని కలుసుకోకపోవచ్చని సమాచారం.

Leave A Reply

Your email address will not be published.