తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా ప్రియాంక గాంధీ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ నింపాలని ఆ పార్టీ అధిష్ఠానం యోచిస్తోందా?. టీ-కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం, ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రియాంక గాంధీని రంగంలోకి దించబోతోందా?. రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యతలు ఆమె చేతుల్లో పెట్టబోతోందా?… పార్టీ అగ్రనేత, ఏఐసీసీ సెక్రటరీ జనరల్‌ ప్రియాంక గాంధీ ఈ నెల 8న ‘యూత్ డిక్లరేషన్’ ప్రకటించేందుకు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఊహాగానం తెరపైకి వచ్చింది.ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ప్రశ్న ఎదురైంది. ప్రియాంకను తెలంగాణ ఇన్‌చార్జిగా నియమించబోతున్నారా? అని ఏబీఎన్ ప్రశ్నించగా ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘‘ ప్రియాంక తెలంగాణ ఇంఛార్జిగా వస్తే మంచిదే’’ అని అన్నారు. ఈ సమాధానంలో ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ ఆయన ఖండించలేదు. దీంతో మరోసారి ఈ ప్రచారం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇదిలావుండగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా పనిచేసిన ఇన్‌ఛార్జీలు ఎవరూ సమర్థవంతంగా రాణించలేకపోయారనే పేరుంది. కనీసం పార్టీలో సీనియర్ల మధ్య సఖ్యత కూడా కుదర్చలేకపోయారనే అభిప్రాయాలు ఉన్నాయి. మరి ప్రియాంక గాంధీ ఇన్‌ఛార్జిగా వస్తే ఇక్కడ పార్టీ పరిస్థితులు మారతాయ అనేది ఆసక్తికరంగా మారింది.

గతంలోనూ ఊహాగానాలు..

ప్రియాంక గాంధీని తెలంగాణ ఇన్‌చార్జిగా నియమించబోతున్నారంటూ గతంలోనూ ఈ తరహా ఊహాగానాలు వెలువడ్డాయి. ఫిబ్రవరి 2019లో ఆమె క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు తొలి బాధ్యతగా తెలంగాణ కాంగ్రెస్‌ను అప్పగించబోతున్నారని ప్రచారం నడిచింది. కాంగ్రెస్ వర్గాలు కూడా ఈ ప్రచారాన్ని ఖండించలేదు. కానీ చివరికి అటువంటిదేమీ జరగలేదు. నాడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తూర్పు ఉత్తరప్రదేశ్‌ బాధ్యతలను ఆమెకు అప్పగించారు. దీంతో అప్పటి నుంచి ఈ బాధ్యతల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇక గతేడాది కూడా ప్రియాంక గాంధీకి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు అప్పగించబోతున్నారని స్వయంగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌‌లో జోష్ నింపడమే లక్ష్యంగా పార్టీ ఈ మేరకు సమాయత్తమవుతోంది. అధిష్ఠానం భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోబోతున్నారని పార్టీ లీకులు ఇచ్చింది. అయితే ఇదంతా ప్రచారమేనని తేలిపోయింది. తాజాగా మరోసారి ఈ ప్రచారం తెరపైకి వచ్చింది. మరి ఈసారైన నిజమవుతుందో లేదో వేచిచూడాలి.

Leave A Reply

Your email address will not be published.