సైకోలు జాత్యహంకారపు , కులాహంకారపు ఆలోచనలు చేస్తారు

-   సైకో తరహా విధ్వంసంపై మాజీ సీజేఐ ఎన్వీ రమణ చురకలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సైకో తరహా విధ్వంసంపై మాజీ సీజేఐ ఎన్వీ రమణ చురకలంటించారు. తానా సభలో ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సైకో తరహా విధ్వంసంపై జాగ్రత్తగా ఉండాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మానసిక స్థిమితం లేని వారే (సైకోలు) జాత్యహంకారపు , కులాహంకారపు ఆలోచనలు చేస్తారని… వ్యాప్తిలోకి తెస్తారని అన్నారు. సైకోలే విచ్ఛిన్నాన్ని, విధ్వంసాన్ని కోరుకుంటారన్నారు. కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలనుకుంటారని దుయ్యబట్టారు. ‘‘నేను.. నా కుటుంబం’’ తప్ప వారికింకేమీ పట్టవని.. కానీ చేసేదంతా సమాజం కోసమే అని నమ్మబలుకుతారన్నారు. ఇంత చదువులు చదివి, ఇంతింత అనుభవం గడించిన తర్వాత కూడా ఇలాంటి ప్రచారాన్ని నమ్మి వినాశానికి ఊతమిస్తున్నామంటే రాబోయే తరాలు మనల్ని క్షమించవని జస్టిస్ చెప్పుకొచ్చారు.

చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోలేని చరిత్ర హీనులుగా మిగిలిపోతామని గుర్తుంచుకోండి అని అన్నారు. ఇంగ్లీషు భాష సర్వరోగ నివారిణి అని నమ్మించే ప్రయత్నాలు పదే పదే జరుగుతూనే ఉంటాయన్నారు. మన వెనుకబాటుతనానికి తెలుగే కారణమని చెప్పే వారూ ఉంటారని.. అంతకు మించిన అసత్యం ఇంకొకటుండదని విమర్శించారు. దార్శనికుడైన నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహంచడం కారణంగా అమెరికాలో ఆంధ్రులకు అవకాశాలు ఒక్కసారిగా పెరిగాయని చెప్పుకొచ్చారు. ప్రతిభావంతులైన తెలుగు యువతీ, యువకులు ఆ అవకాశాలను అందిపుచ్చుకున్నారని తెలిపారు. ఎందరికో చేయూతనిచ్చారని.. సంపద పెరిగిందని… సంపాదన పెరిగిందని.. వసతులు పెరిగాయన్నారు. స్వదేశంలో తల్లి దండ్రులు, బంధుమిత్రుల జీవన ప్రమాణాలు కూడా పెంచగలిగారని తెలిపారు. ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేంత వరకు తెలుగువారంతా విశ్రమించకూడదు అంటూ తానా సభల్లో జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.