24 వేలు ధర పలికిన పులస చేప

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పులస.. ఈ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది గోదావరి జిల్లాలు. పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే అనే సామెత కూడా చాలా ఫేమస్. అందుకే ప్రతి ఏటా గోదావరి జిల్లాల్లో పులస చేప కోసం జనాలు ఎదురు చూస్తుంటారు. తొలకరి మొదలు కాగానే గోదావరికి ఎర్ర నీరు వస్తుంది.. ఆ వెంటనే పులసల సీజన్ మొదలైనట్లే. అయితే గోదావరి జిల్లాల్లోకి పులస ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చేసింది. ప్రస్తుతం గోదావరికి ఎర్రనీరు వస్తుండటంతో.. మొదటి పులస చేప వలకు చిక్కింది.డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక మత్స్యకారుల వలకు పులస చేప చిక్కింది. సుమారు కేజీన్నర బరువున్న పులస చేపను వేలం వేయగా.. మాజీ సర్పంచి బర్రే శ్రీను రూ.24 వేలకు ఈ చేపను కొనుగోలు చేశారు. ఈసారి సీజన్‌కు ఇదే మొదటి పులస చేప అని చెబుతున్నారు. ఈ చేప కోసం స్థానికులు పోటీపడగా రికార్డ్ ధరకు మాజీ సర్పంచి దక్కించుకన్నారు.ఈ పులస చేపలు ఉభయ గోదావరి జిల్లాల్లో తొలకరి తర్వాత మత్స్యకారుల వలకు చిక్కుతుంటాయి. కాకినాడ, కోనసీమ, యానాం, ఇటు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా జాడ ఉంటుంది. ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో ఉండే ఈ అరుదైన చేపలు.. తమ సంతానోత్పత్తి కోసం సుదూర ప్రాంతాల నుంచి ఈదుకుంటూ బంగాళాఖాతం చేరుకుంటాయి. ఆ తర్వాత గోదావరి, సముద్రం కలిసే ప్రాంతానికి వచ్చి ఎర్రనీటిలో ప్రయాణిస్తూ సంతానం ఉత్పత్తి చేస్తాయి. హిల్సా ఇలీషా పేరుతో పిలిచే ఈ చేప గోదావరి ఎర్రనీటిలోకి రాగానే పులసగా పిలుస్తారు. ఈ చేపలు బంగాళాఖాతం నుంచి ఎదురీదుకుంటూ నదిలోకి వచ్చి పులసగా మారుతాయి.విలస ఈదుతూ గోదావరి, సముద్రం కలిసే ప్రాంతానికి వస్తుంది.. వరద గోదావరి ప్రవాహానికి ఎదురీదుతుంది. నదిలోనే సంతానాన్ని వృద్ధి చేస్తూ.. శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. తెల్లటి విలస కాస్తా వరద నీటి కారణంగా ఎరుపు, గోధుమ వర్ణంలోకి మారిపోయి పులసగా మారుతుంది. సంతానాన్ని వృద్ధి చేశాక పిల్లలతో తిరిగి వెనక్కి వెళ్లిపోతాయి.. ఈ క్రమంలోనే పులసలు మత్స్యకారుల వలలకు చిక్కుతాయి.పులసల సీజన్‌లో డిమాండ్‌‌ను క్యాష్ చేసుకోవడానికి కొందరు ఇలసలను పులసలుగా చెప్పి అమ్మేస్తుంటారు. ఒడిషా సముద్ర తీరంలో ఎక్కువగా దొరికే ఇలసలను తక్కువ ధరలకు తీసుకొచ్చి పులసలుగా విక్రయిస్తుంటారు. ఈ రెండు చేపల మధ్య తేడా గుర్తించడం కూడా కష్టమే అని చెబుతంటారు

Leave A Reply

Your email address will not be published.