ఐసీసీ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన తర్వాత పుతిన్ మొదటి విదేశీ పర్యటన

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: గత కొన్ని రోజులుగా దేశ సరిహద్దులు దాటని రష్యా అధ్యక్షుడు పుతిన్

మొదటిసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది అక్టోబర్‌లో చైనా లో పుతిన్‌

అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో బీజింగ్‌లో జరిగే బెల్ట్‌ అండ్‌ రోడ్‌ సదస్సు

కు ఆయన హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సదస్సుకు హాజరుకావాలన్న చైనా

అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆహ్వానాన్ని పుతిన్‌ అంగీకరించినట్లు బ్లూమ్‌బర్గ్‌ తన నివేదికలో పేర్కొంది. దీంతో అధ్యక్షుడి చైనా పర్యటన కోసం క్రెమ్లిన్‌ సిద్ధమైనట్లు తెలిపింది.రష్యా యుద్ధంలో అతలాకుతలమైన ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు గానూ పుతిన్‌పై ఐసీసీ (ICC) అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అరెస్ట్‌ భయంతో ఆయన అన్ని విదేశీ పర్యటనలనూ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ద‌క్షిణాఫ్రికాలోని జోహ‌న్నస్‌బ‌ర్గ్‌లో జరిగిన బ్రిక్స్ దేశాల స‌మావేశాలకు కూడా హాజరుకాలేదు. అయితే వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ఇక సెప్టెంబర్‌లో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశాలకు కూడా పుతిన్‌ వ్యక్తిగతంగా హాజరుకావడం లేదు. జీ20 సమ్మిట్‌లో కూడా వర్చువల్‌గానే పాల్గొంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పుతిన్‌ చైనా పర్యటకు ఒప్పుకోవడం గమనార్హం. ఐసీసీ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన తర్వాత ఆయన చేయనున్న మొదటి విదేశీ పర్యటన ఇదే.

 

పుతిన్‌పై అరెస్ట్ వారెంట్

 

ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు గానూ ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ICC) పుతిన్‌పైఅరెస్ట్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌(Ukraine)లోని పిల్లల్ని చ‌ట్టవ్యతిరేకంగా డిపోర్ట్(Deport) చేసిన‌ట్లు పుతిన్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో హేగ్‌లోని ఐసీసీ.. ర‌ష్యాకు చెందిన చిల్డ్రన్ రైట్స్ క‌మిష‌న‌ర్ మారియా లోవా బెలోవాకు కూడా అరెస్టు వారెంట్ జారీ చేసింది.ఐసీసీ ఆదేశాల ప్రకారం.. ఒక‌వేళ పుతిన్ ఏదైనా ఐసీసీ స‌భ్య దేశంలో అడుగుపెడితే, అప్పుడు అత‌న్ని అరెస్టుచేసే అవ‌కాశాలు ఉంటాయి. అంత‌ర్జాతీయ క్రిమిన‌ల్ కోర్టులో సుమారు 120 స‌భ్య దేశాలు ఉన్నాయి.అయితే వారెంట్‌ను అమ‌లు చేసే ప‌రిస్థితి మాత్రం అంత‌ర్జాతీయ దేశాల స‌హ‌కారంపై ఆధార‌ప‌డి ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.