తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు..

 రైలులో చిక్కుకుపోయిన 800 మంది ప్రయాణికులు..!

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడురోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం 525 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందంటే ఎంత భారీ వర్షాలు కురుస్తున్నాయో తెలుస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో వరదలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్ల నుంచి ఆహార పొట్లాలు, నిత్యవసర సరుకులు అందిస్తున్నారు. మరో వైపు మంగళవారం సైతం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత 24 గంటల్లో సుమారు 670 మిల్లీమీటర్లు తిరునెల్వేలి, టుటికోరిన్‌లో 932 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. పలు స్టేషన్లు జలమయమయ్యాయి. రైలు సేవలకు అంతరాయం కారణంగా తిరుచెందూర్-తిరునల్వేలి స్టేషన్ల మధ్య నడుస్తున్న రైలులో 800 మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. స్థానిక అధికారులతో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ప్రయాణికులను రక్షించి.. సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు.రైలులో చిక్కుకుపోయిన ప్రయాణికులను చేరుకోవడానికి బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ పేర్కొంది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా తరలించేందుకు వైమానిక దళం రంగంలోకి దిగింది. గర్భిణితో పాటు ఏడాదిన్నర బాలిక సహా నలుగురు ప్రయాణికులను వైమానిక దళం సురక్షితంగా రక్షించింది. ఇదిలా ఉండగా.. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రధానితో సమావేశమై పరిస్థితిని వివరించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.