సొంతగూటికి రాజగోపాల్ రెడ్డి…?

- కాంగ్రెస్‌లో చేరికపై పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి సంప్రదింపులు - ఈటల మాత్రమే కాదు.. తాము కూడా ఉద్యమకారులమే. - ఈటలకు కీలక పదవి పై  విజయశాంతి గరం..గరం..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించిన తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఉన్నట్టుండి బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తొలగించడాన్ని పలువురు సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంత సడన్‌గా అధ్యక్షుడ్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ఇక అధిష్టానం వ్యవహారశైలిపై మాజీ ఎంపీ వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, తదితరలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్‌కు తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించడంపై విజయశాంతి గరం అయినట్లు తెలుస్తోంది. ఈటల మాత్రమే కాదు.. తాము కూడా ఉద్యమకారులమేనని విజయశాంతి వ్యాఖ్యానించారు. బీజేపీలో చోటుచేసుకున్న తాజా పరిణామాలు భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో వేచి చూడాలి.

సొంతగూటికి రాజగోపాల్ రెడ్డి…?

ఇదిలా ఉంటే ఇటీవల ఖమ్మం సభలో రాహుల్‌ గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరికపై పొంగులేటితో రాజగోపాల్‌రెడ్డి సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డిని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. దీంతో రాజగోపాల్ సొంతగూటికి చేరబోతున్నారా అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. కమలం పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న రాజగోపాల్‌రెడ్డి హస్తం గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది.

ఇక కర్ణాటకలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ మంచి ఊపుమీద ఉంది. తెలంగాణలో కూడా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. ఆ దిశగా హస్తం పార్టీ పావులు కదుపుతోంది. ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోయారు. త్వరలోనే జూపల్లి కృష్ణారావు కూడా చేరనున్నారు. వీరితో పాటు మరికొందరు హస్తం గూటికి చేరనున్నట్లు చర్చ నడుస్తోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించి.. ఆయన స్థానంలో కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. అటు ఏపీలో కూడా సోము వీర్రాజును అధ్యక్షుడిగా తప్పించి.. ఆయన స్థానంలో పురంధేశ్వరిని పార్టీ అధ్యక్షురాలిగా బీజేపీ అధిష్టానం నియమించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను హైకమాండ్ మార్చింది. ఈ మార్పులే తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు రేగడానికి కారణమైంది.

Leave A Reply

Your email address will not be published.