స్వలింగ పెళ్లిళ్లకు గుర్తింపు

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: స్వలింగ వివాహాలకు చట్టబద్ధ గుర్తింపు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ప్రారంభించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హిమ కొహ్లీ ఉన్నారు. దాదాపు 15 పిటిషన్లను కలిపి ఈ రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది.

కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన ముఖ్యమైన అంశాలు ఏమిటంటే..

  1. స్వలింగ వివాహాలకు సాంఘిక-చట్టబద్ధ వ్యవస్థను ఆపాదించడానికి లేదా సృష్టించడానికి జరిగే చర్చకు వేదిక ఈ న్యాయస్థానం అయి ఉండాలా?పార్లమెంటు అయి ఉండాలా?

2 .ఐదుగురు ఆవైపున, ఐదుగురు ఈవైపున, ఐదుగురు మేధావులు ధర్మాసనంపైనా ఉండి చర్చించగలిగే అంశం కాదు ఇది. దక్షిణాదిలోని రైతు, ఉత్తరాదిలోని వ్యాపారి అభిప్రాయాలేమిటో తెలియదు.

  1. ‘‘మేం సజాతి వ్యక్తులం. సమాజంలోని స్త్రీ,పురుషుల మాదిరిగానే మాకు కూడా రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి. గౌరవనీయ న్యాయమూర్తులు దీనిని స్పష్టం చేశారు. మా సమాన హక్కులకు ఏకైక అడ్డంకి సెక్షన్377 మాత్రమే. క్రిమినాలిటీ ఇప్పుడు పోయింది. చట్టం నుంచి అసహజ భాగం పోయింది. కాబట్టి మా హక్కులు సమానం’’ అని పిటిషనర్ల తరపు న్యాయవాది రోహత్గి ధర్మాసనానికి తెలిపారు. ‘‘రాజ్యం చెప్పినట్లుగా మా హక్కులు ఒకే విధమైనవి అయితే, రాజ్యాంగంలోని అధికరణలు 14, 15, 19, 21 ప్రకారం మా హక్కులను సంపూర్ణంగా అనుభవించాలని కోరుకుంటున్నాం. మా ఇళ్ళల్లో మాకు వ్యక్తిగత గోప్యత కావాలి. అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో కళంకం, అపవాదులను ఎదుర్కొనకూడదు. ఇతరులు పెళ్లి చేసుకుంటున్నట్లుగానే, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లుగానే, మేము కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య అటువంటి వ్యవస్థను కోరుకుంటున్నాం. మేము ఇలా కోరుకోవడానికి కారణం సమాజంలో పెళ్లికి, కుటుంబానికి గౌరవం ఉండటమే. మాకు ఒకే విధమైన హక్కులు ఉన్నపుడు, పెళ్లి హక్కును ఎందుకు పొందలేకపోతున్నాం?. ఇది అమెరికా, తదితర దేశాల్లో జరుగుతున్న పరిణామం. పెళ్లి చేసుకునే హక్కు మాకు ఉందనే డిక్లరేషన్ మాకు కావాలి. రాజ్యం ఈ హక్కును గుర్తించాలి, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం రిజిస్టర్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇది జరిగితే, సమాజం మమ్మల్ని ఆమోదిస్తుంది. రాజ్యం దీనిని గుర్తించినపుడే కళంకం పోతుంది. అది మాత్రమే సంపూర్ణ, అంతిమ అవగాహన అవుతుంది’’ అని తెలిపారు.

ఇదిలావుండగా, కేంద్ర ప్రభుత్వం సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ పిటిషన్లను తోసిపుచ్చాలని సుప్రీంకోర్టు ను కోరింది. స్వలింగ వివాహాలను గుర్తించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు పట్టణ ఉన్నత వర్గాల అభిప్రాయాలను ప్రతిబింబిస్తున్నాయని, ఆ అభిప్రాయాలకు సాంఘిక ఆమోదం కోరుతున్నాయని, అందువల్ల వీటిని తిరస్కరించాలని కోరింది. ఈ సమస్యను ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల నిర్ణయానికి వదిలిపెట్టాలని కోరింది.

Leave A Reply

Your email address will not be published.