నాగార్జున వర్సిటీలో వైయస్సార్ విగ్రహం తొలగింపు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: జగన్ మెప్పు కోసం నిబంధనలు తుంగలోకి తొక్కి, విశ్వవిద్యాలయ పవిత్రతకూ పంగనామాలు పెట్టి కొందరు వీసీలు చేసిన దుశ్చర్యలను ఇప్పుడు విద్యార్థులు, అధికారులు సంయుక్తంగా సరిదిద్దుతున్నారు. అందులో భాగంగానే గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని సోమవారం (జూన్ 10) తొలగించారు.

నాడు సకల విలువలకూ తిలోదకాలిచ్చి, సమాజానికి విద్యావంతులను అందించే విశ్వవిద్యాలయ ప్రాంగణంలో రాజకీయ నాయకుల విగ్రహాల ప్రతిష్ఠ వద్దని ఎంత మంది నెత్తీ నోరూ బాదుకుని చెప్పినా వినకుండా వీసీ రాజశేఖర్ జగన్ మెప్పు కోసం ప్రాపకం కోసం వర్సిటీ నిధులను వ్యయం చేసి మరీ వైఎస్ విగ్రహాన్ని యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. నాటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అప్పటి నుంచీ వర్సిటీ ప్రాంగణంలోని వైఎస్ విగ్రహాన్ని తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే అధికారం అండతో, ప్రభుత్వ దన్నుతో వీసీ రాజశేఖర్ పెడచెవిన పెట్టారు. అంతే కాదు వీసీ రాజశేఖర్ అప్పటి ప్రభుత్వ ప్రాపకం కోసం పాకులాడి సరస్వతీ నిలయం లాంటి నాగార్జున విశ్వవిద్యాలయాన్ని రాజకీయ చర్చలకు వేదికగా మార్చేశారు. విశ్వవిద్యాలయంలో మూడు రాజధానులకు అనుకూలంగా సమావేశాలు, చర్చలు నిర్వహించారు. అంతేనా వైసీపీ ప్లీనరీ కోసం వర్సిటీ ప్రాంగణంలో పార్కింగ్ స్థలాన్ని కూడా కేటాయించారు.

ఇప్పుడు జగన్ సర్కార్ ఘోరంగా ఓటమి పాలై ప్రభుత్వం మారిన నేపథ్యంలో విద్యార్థులు ఒక్కసారిగా తమ గళాన్ని విప్పారు. వీసీపై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీ ప్రాంగణంలోని వైఎస్ విగ్రహాన్ని తొలగించాలని గట్టిగా పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో వీసీ రాజశేఖర్ విద్యార్థులతో రెండు దఫాలుగా చర్చలు జరిపి రెండు రోజులలో విగ్రహాన్ని తొలగిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.