కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

 

తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణలో విద్యారంగం అస్తవ్యస్తంగా ఉందంటూ విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ చేసిన ప్రవీణ్ కుమార్.. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఎంతో మంది నిరుపేద పిల్ల‌ల‌ను విదేశాల‌కు పంపి చ‌దివించింద‌ని, కానీ కాంగ్రెస్ స‌ర్కార్‌లో విద్య‌ను గాలికి వ‌దిలేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ క్రమంలోనే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీ అండతో అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చదువుకుంటున్న లావణ్య, హారిక, ప్రశాంత్ అనే ముగ్గురు విద్యార్థుల దుస్థితిని వివరించారు. సదరు విద్యార్థుల తండ్రి గోడు చెప్పుకుంటూ రాసిన లేఖంటూ ఎక్స్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు.

 

‘‘ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా.. సొసైటీ పూర్తి బాధ్యత తీసుకుని వారిని అమెరికాకు పంపించింది. ప్రతి సెమిస్టర్‌కు 6000 వేల డాలర్ల చొప్పున మొదటి 3 సెమిస్టర్లకు సొసైటీనే ఫీజు చెల్లించింది. కానీ ఇప్పుడు 4, 5 సెమిస్టర్ల కోసం సొసైటీ నుంచి ఫీజు విడుదల కాలేదు. ఎన్నిసార్లు ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. ప్రస్తుతం పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సెక్రెటరీ గారికి ఫోన్ చేస్తే ‘మా సొసైటీ అకౌంట్ డబ్బులు ఇమ్మంటారా? మీ పిల్లలతో మాకు ఏమి సంబంధం?’ అన్నట్టు మాట్లాడుతున్నారు. మా పిల్లల భవిష్యత్తు నాశనం కాకుండా సహాయం చేయండి’’ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ‘మీ కాంగ్రెస్ నాయకుల పిల్లలే విదేశాల్లో చదవాల్నా? మా పేద పిల్లలు చదవొద్దా? ప్రశ్నించే గొంతుకలకు ఈ పేద బిడ్డల గోస కనిపించదా?’ అంటూ కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీశారు.

Leave A Reply

Your email address will not be published.