ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న పెనక శరత్ చంద్రారెడ్డికి రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్‌ను శుక్రవారం రాత్రి కోర్టు మంజూరు చేసింది. తన భార్యకు ఆరోగ్యం సరిగా లేదని, కొన్ని ముఖ్యమైన విషయాల్లో చికిత్స తీసుకోవాల్సి ఉందని ఆరు వారాల పాటు బెయిల్ ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డి న్యాయస్థానాన్ని కోరాడు. ఈ విషయాలను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు.. మానవతా కోణంలో ఆలోచించి 4 వారాల మధ్యంతర బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. కాగా.. పూచీకత్తుతో పాటు కొన్ని కండీషన్స్‌తో న్యాయస్థానం బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

శరత్ చంద్రారెడ్డి.. అరబిందో ఫార్మా కంపెనీలో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అరబిందో గ్రూపులోని మొత్తం 12 కంపెనీలకు ఆయన డైరెక్టర్‌గా ఉన్నాడు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే.. మద్యం కుంభకోణం కేసులో ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ను ఎఫ్‌ఐఆర్‌‌లో సీబీఐ చేర్చింది. సరిగ్గా అప్పుడే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శరత్ చంద్రారెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి అనుగుణంగా ఈఎండీలు చెల్లించినట్లు సీబీఐ, ఈడీ అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణం కేసులో పలుమార్లు అటు సీబీఐ.. ఇటు ఈడీ అధికారులు లోతుగా విచారణ జరిగిన తర్వాత నవంబర్ నెలలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ అనంతరం తీహార్ జైల్‌లో శరత్ ఉన్నాడు. అయితే ఈ కేసులో శరత్ కీలక నిందితుడిగా ఉన్నాడు. మద్యం వ్యాపారంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఈ ఇద్దరు పెద్ద వ్యాపారులకు సంబంధం ఉందని ఈడీ వెల్లడించిన విషయం తెలిసిందే. శరత్ చంద్రారెడ్డి, వినోయ్ బాబుకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారం ఉందని తెలిపింది. అప్పట్లో శరత్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే అయ్యింది. ముఖ్యంగా వైసీపీ శిబిరంలో ఒక్కసారిగా టెన్షన్ వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి.

అప్పట్లో.. శరత్‌ చంద్రారెడ్డిని రౌజ్‌ అవెన్యూ కోర్టులో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలుసుకున్నారు. రిమాండ్‌ విధించిన తర్వాత శరత్‌ రెడ్డిని జైలుకు తరలించడానికి దాదాపు గంటకుపైగా సమయం పట్టింది. ఆ క్రమంలో చెవిరెడ్డి కోర్టుకు వచ్చారు. శరత్‌ రెడ్డిని జైలుకు తరలించడానికి కోర్టు హాలు నుంచి పోలీసు కారులో ఎక్కించే వరకు వారిద్దరూ సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు.

కాగా.. ఇప్పటికే శరత్ చంద్రారెడ్డి మధ్యంతర బెయిల్ కోసం పలుమార్లు పిటిషన్‌‌లు వేశాడు. రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్లపై విచారణ జరిగింది. శరత్ చంద్రారెడ్డి తన నానమ్మ అంత్యక్రియలలో కర్మకాండలు జరపాల్సిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషనర్ తరఫున న్యాయవాది కోరారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి శరత్ చంద్రారెడ్డికి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. అనంతరం రూ.2 లక్షల పూచికత్తుపై జస్టిస్ నాగ్‌పాల్ ధర్మాసనం 14 రోజుల బెయిల్ మంజూరు చేసింది.

Leave A Reply

Your email address will not be published.