పెద్దల హస్తం నుండి చెరువుని కాపాడండి

.. మండల పరిషత్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ బ్యూరో: పెద్దల హస్తం నుండి చెరువుని కాపాడాలని  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం ఎంపిపి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం వెంకటాపూర్ గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆవరణలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు మూడు సంవత్సరాల నుండి వెంకటాపూర్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి నాడెం చెరువును కొంతమంది బడా నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు .ఇప్పటికే ఈ చెరువుపై బ్యాంకు ద్వారా సుమారు 13 కోట్ల రూపాయలు రుణం సైతం పొందారని ఆయన అన్నారు .చెరువు పై బ్యాంకు అధికారులు లోన్ ఇవ్వడం ఏంటని ఇందుకు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సైతం సహకరించడం గమనార్హం అని పేర్కొన్నారు.అంతే కాకుండా ఏళ్ల తరబడి వెంకటాపూర్ గ్రామానికి చెందిన సుమారు 106 ముదిరాజ్ కుటుంబాలు చెరువును నమ్ముకుని చేపల వృత్తిపై ఆధారపడి ఉన్నాయని అన్నారు.

అదేవిధంగా చెరువు ఆయకట్టు కింద పంటలు పండించుకునే రైతులు సైతం ఈ చెరువుకు కబ్జాకు గురైతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు.గతంలో 1973- 75 వరకు తనకున్న సమాచారం మేరకు ఈ చెరువు భూమి సీలింగ్ ల్యాండ్ కింద ఉందని పేర్కొన్నారు .ఇప్పటికైనా పెద్దల హస్తం నుండి నాడెం చెరువును కబ్జాకు గురికాకుండా ప్రభుత్వ పెద్దలు కాపాడాలని ఆయన కోరారు .అదేవిధంగా చెరువు ను ఎవరైన కబ్జాకు పాల్పడిన ఎలాంటి చర్యలు చేపట్టిన గ్రామస్తులతో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు .అంతేకాకుండా గతంలో ఈ చెరువు పరిసరాలకు ఎవరు వెళ్ళద్దని వెళ్లిన వారికి సైతం కొంతమంది బడా నాయకులు బెదిరింపులకు సైతం పాల్పడ్డారని ఆయన తెలిపారు. ఏది ఏమైనప్పటికీ చెరువు కబ్జా బ్యాంకు రుణం మంజూరు పై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చెరువును నమ్ముకొని ఉన్న రైతులకు ముదిరాజ్ కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ రామారావు ,ఉప సర్పంచ్ సత్యనారాయణ ,ముదిరాజ్ సంఘం సభ్యులు లింగం, పాండు సహదేవ్, భాస్కర్ ,విజయ్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.