ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో గ్రూప్ వన్ పరీక్షలు రాసిన అభ్యర్థుల ఇళ్లల్లో సోదాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు మల్యాల మండలంలో సోదాలు చేపట్టారు. గ్రూప్ వన్ పరీక్షలు రాసిన అభ్యర్థుల ఇళ్లల్లోకి వెళ్లి సోదాలు చేస్తున్నారు. మల్యాల మండలంలో మొత్తం 40 మంది పరీక్ష రాసినట్లు గుర్తించారు. ఐదు బృందాలతో అభ్యర్థుల ఇళ్లను జల్లడపడుతున్నారు. అభ్యర్థుల విద్యార్హత వివరాలు, శక్తి సామర్థ్యాలను కూడా పరిశీలిస్తున్నారు.మరోవైపు ఇదే కేసులో ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్న ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యను సిట్ అధికారులు విచారించారు. ప్రధాన నిందితులతో సంబంధాలు, పేపర్ విక్రయాలపై అధికారులు ఆరా తీశారు. ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించారు. ఈ నెల 6 వరకు నిందితులను విచారించనున్నారు.గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో 100కు పైగా మార్కులు వచ్చిన అభ్యర్థులందరినీ సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే సుమారు వంద మందిని మొదటి దశలో సిట్ ఆఫీస్‌కి పిలిపించి వారి పూర్తి వివరాలు తీసుకొని పంపించారు. అభ్యర్థులను మళ్ళీ రెండోసారి, కొంతమంది అభ్యర్థులను మూడోసారి పిలిచి విచారిస్తున్నారు. TSPSC నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మోడల్ పేపర్ తెప్పించి వీరితో పరీక్ష రాయించారు.

అటు సిట్ అధికారులు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సెక్రటరీ, సభ్యులను విచారించారు. దీనిపై 11వ తేదీన స్టేటస్ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పిస్తామని సిట్ అధికారులు తెలియజేశారు. అరెస్ట్ అయిన నిందితుల సెల్ ఫోన్లు, లాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ విభాగానికి అధికారులు పంపారు. ఒకటి రెండు రోజుల్లో ఫోరెన్సిక్ నివేదిక సిట్‌కు అందే అవకాశముంది.

ఇటు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంపై ఈసీఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇచ్చిన ఫిర్యాదులతోపాటు.. పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న ఆధారాల మేరకు ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో హవాలా మార్గంలో డబ్బులు చేతులు మారినట్లు ఈడీ అనుమానిస్తోంది. పేపర్‌ లీకేజీకి సంబంధించి టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్‌ ఫిర్యాదు మేరకు తొలుత బేగంబజార్‌ పోలీసులు కేసు నమోదు చేయగా.. కేసు తీవ్రత దృష్ట్యా హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిట్‌ ఇప్పటివరకు ప్రధాన నిందితులు టెక్నికల్ సర్వీస్‌ నుంచి టీఎస్‌పీఎస్సీకి డిప్యుటేషన్‌పై వచ్చిన రాజశేఖర్ రెడ్డిసిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలానికి చెందిన ఉపాధ్యాయురాలు రేణుకసహా.. మొత్తం 15 మందిని అరెస్టు చేసింది. కోర్టు అనుమతితో పలువురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించింది.

ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణంలో సమాంతర దర్యాప్తు చేయనుంది. అరెస్టయిన 15 మందిని కోర్టు అనుమతితో విచారించనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సెక్రటరీ, సభ్యులను, ఇతర ఉద్యోగులను కూడా విచారించే అవకాశాలున్నాయి. మనీలాండరింగ్‌ కోణంలో నిందితుల యూపీఐ లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, నగదు బదిలీ వంటి అంశాలపై ఆయా బ్యాంకులకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ముఖ్యంగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో.. పేపర్‌ లీకేజీతో వచ్చిన కోట్ల రూపాయలను ప్రవీణ్‌, రాజశేఖర్‌ హవాలా మార్గాల్లో విదేశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని బట్టి, ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందంటూ ఆయన తన ఫిర్యాదులో ఆరోపించారు. ఆధారాలను బయటపెడుతున్న విపక్షాలపై సిట్‌ కేసులు నమోదు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రశ్నపత్రాల లీకేజీతో కోట్ల రూపాయలను కొల్లగొట్టిన నిందితులను అరెస్టు చేయాలని ఆ ఫిర్యాదులో కోరారు. విదేశాల నుంచి వచ్చిన ఎన్నారైలు గ్రూప్‌-1 పరీక్ష రాశారని, దీనిపైనా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. కాన్ఫిడెన్షియల్‌ విభాగం ఇన్‌చార్జి శంకర్‌లక్ష్మికి, చైర్మన్‌, సెక్రటరీలకు తెలియకుండా టీఎస్‌పీఎస్సీలో సాధారణ ఉద్యోగులు లీకేజీకి పాల్పడే అవకాశాలు లేవని, వారిని కూడా విచారించాలని రేవంత్‌రెడ్డి ఈడీని కోరారు.

Leave A Reply

Your email address will not be published.