హైదరాబాద్ లో భారీగా హవాలా సొమ్ము పట్టివేత

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: టూవీలర్ పై పెద్ద మొత్తంలో డబ్బుని తరలిస్తున్న ఇద్దరిని పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 2 కోట్ల 49 లక్షల 79వేల రూపాయల అక్రమ నగదును స్వాధీనం చేసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించినట్లు బంజారాహిల్స్ ఏసీపీ ఎం. సుదర్శన్ ఆదివారం తెలిపారు. అయితే భారీగా పట్టుబడ్డ ఈ నగదుతో మునుగోడు ఉప ఎన్నికకు ఏదైనా లింకు ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొచ్చు రాము(52)హైదరాబాద్ కేపీహెచ్ బీలోని రామో విస్టాస్ లో ఉంటున్నాడు. బొచ్చు రాము..బెంగళూరుకి చెందిన బోయాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. అయితే శనివారం(అక్టోబర్ 8,2022)రాత్రి ఢిల్లీలో ఉన్న పోలా సత్యనారాయణ అనే తన ఫ్రెండ్ సూచనల మేరకు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్.76కు వెళ్లాడు రాము. పోలా సత్యనారాయణ సూచనల మేరకు అక్కడ ఓ గుర్తుతెలియని వ్యక్తి పోలా సత్యనారాయణ అందించిన రూ.10 నోటుని చూపించాడు. సీరియల్ నెంబర్(49బీ847015)సరిచూసుకున్న ఆ గుర్తుతెలియని వ్యక్తి రూ. 2.49 కోట్లు ఉన్న బ్యాగ్ ను రాముకి ఇచ్చి వెళ్లిపోయాడు. అయితే ఈ నగదు బ్యాగ్ ను బేగంబజార్ కొల్సావాడిలో ఉండే హవాలా వ్యాపారి లలిత్ కు అందజేయాలని సత్యనారాయణ సూచించాడు. అయితే లలిత్..తన దగ్గర పనిచేసే సుధీర్ కుమార్,అశోక్ సింగ్ లకు ఈ డబ్బు బ్యాగ్ ను తీసుకొచ్చే బాధ్యత అప్పగించాడు. దీంతో జూబ్లీహిల్స్ లో ఉన్న రాము దగ్గరకు  బైక్ పై వెళ్లిన వారిద్దరు డబ్బు బ్యాగ్ ను అతడి దగ్గర నుంచి తీసుకొని బేగంపేట బయల్దేరారు. అయితే మార్గమధ్యలో వీరి బైక్ ను పోలీసులు ఆపారు. ముందస్తు సమాచారంలో సుధీర్ కుమార్,అశోక్ సింగ్ ప్రయాణిస్తున్న బైక్ ను పశ్చిమ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆపి వారి దగ్గర ఉన్న బ్యాగ్ ను చెక్ చేయగా అందులో భారీగా నగదు ఉండటాన్ని గుర్తించారు. వీరిని విచారించగా..రాము పేరు బయటకి వచ్చింది. దీంతో పోలీసులు రాముని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.  ఇక,హవాలా వ్యాపారి లలిత్ పారిపోయారు. పరారీలో ఉన్న లలిత్,సత్యనారాయణల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక,నగదు స్వాధీనం చేసుకుని వీరిపై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు 41-A నోటీసులు జారీ చేసి పంపారు. ఈ డబ్బుతో మునుగోడు ఉప ఎన్నికకు ఏమైనా లింకులున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గడిచిన 4 రోజుల్లో హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో రూ.3.7కోట్లకు పైగా అక్రమ నగదు పట్టుబడినట్లు సమాచారం. ఈ అక్రమ లావాదేవీల వెనుక రాజకీయ పార్టీల ప్రమేయం ఉందా? అభ్యర్థులకు ఏమైనా సంబంధాలున్నాయా?అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.