త్వరలో  ఢిల్లీకి షర్మిల!..కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో భేటీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారంటూ జోరుగా ఊహాగానాలు, ప్రచారం జరుగుతున్న వేళ ఇందుకు ఊతమిచ్చేలా కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు రోజుల్లో షర్మిల ఢిల్లీకి వెళ్తున్నారనే సమాచారం ఒక్కసారిగా గుప్పుమంది . ఈ పర్యటనలో ఆమె కాంగ్రెస్‌ ముఖ్యనేతలో భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. కాగా వైఎస్ షర్మిల ఇప్పటికే కార్ణటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పలుమార్లు భేటీ అయిన విషయం తెలిసిందే.ఢీకేతో భేటీ అయిన మరుసటి రోజే వైఎస్‌ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం, షర్మిల మధ్య చర్చలు జరిగినట్లుగా వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఏపీలో షర్మిల సేవలను వాడుకునేందుకు వీలుగా వైఎస్‌ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలంటూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రతిపాదించారని.. విలీనానికి షర్మిల ఇష్టపడలేదనే వార్తలు వచ్చాయి. విలీనం లేదా పొత్తు ప్రతిపాదనలపై అటు హైకమాండ్‌, ఇటు షర్మిలకు మధ్య సమన్వయకర్తగా శివకుమార్‌ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని షర్మిల చెప్పారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వవైభవం సాధించే దిశగా వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరిగాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్‌లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు షర్మిల అంగీకరిస్తే, ప్రస్తుతం వైఎస్‌ఆర్టీపీలో ఉన్న చాలా మంది నేతలు మళ్లీ సొంతగూటికి వచ్చే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.

తెలంగాణలో భవిష్యత్ అంటున్న షర్మిల

షర్మిలను పార్టీలో చేర్చుకుని పొగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని హస్తం పార్టీ తలపిస్తోంది. కానీ షర్మిల మాత్రం తన భవిష్యత్తు తెలంగాణతోనేనని ఇదివరకే కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు. తన చివరి శ్వాస వరకూ తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. ఊహాజనిత కథలు కల్పిస్తూ తనకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాథాన్ని సృష్టించే విఫలయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పనిలేని.. పసలేని దార్శనికులకు తాను చెప్పేది ఒకటేనని, తన రాజకీయ భవితపైన పెట్టే దృష్టిని.. సమయాన్ని కేసీఆర్‌ పాలనపైన పెట్టాలన్నారు. కేసీఆర్‌ పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితపైన దృష్టి పెట్టాలని, కేసీఆర్‌ కుటుంబ అవినీతిని ఎండగట్టాలని సూచించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరితే.. ఆమె సేవలను ఏపీలో వినియోగించుకుంటామంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు.

ఏపీలో పునర్‌వైభవం కోసం కాంగ్రెస్ తాపత్రయం..

ఏపీ పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పార్టీ పాకులాడుతోంది. పీసీసీ నేతలను మార్చినప్పటికీ ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మొదటిసారిగా రఘువీరారెడ్డి ఆ తర్వాత శైలజానాథ్‌ పీసీసీ బాధ్యతలు చేపట్టారు. అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ సత్తా చూపించలేకపోయింది. ప్రస్తుతం గిడుగురాజు రుద్రరాజు చేతిలో ఏపీ కాంగ్రెస్ పగ్గాలున్నాయి. రుద్రరాజు బాధ్యతలు తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్‌ఆర్టీపీ అధినేత షర్మిల ను కాంగ్రెస్ చేర్చుకుని పూర్వవైభవం తేవాలని ఆ పార్టీ నేతలు ఆరాటపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.