సార్….. రాత్రికి రాత్రే మా ఇండ్లు కూల్చేశారు

- సర్టిఫికేట్లు, రేషన్ కార్డులుసహా అన్నీ ధ్వంసం చేశారు - 3 రోజులుగా తినడానికి తిండి లేక నడిరోడ్డుపైనే చలిలో బతుకీడుస్తున్నం - బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కు సైదాబాద్ లోకాయుక్త బస్తీవాసుల మొర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సార్… సైదాబాద్ లోని లోకాయుక్త కాలనీలో 50 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నం. టీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు కుట్ర చేసి మా ఇండ్లను కూల్చి వేయించారు. రాత్రికి రాత్రే పోలీసుల సాయంతో అధికారులు వచ్చి మా గుడిసెలను పీకేశారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, పిల్లల సర్టిఫికెట్లుసహా దాచుకున్న డబ్బులన్నీ ధ్వంసమయ్యాయి. కట్టుబట్టలతో 3 రోజులుగా చలిలో వణికిపోతున్నం. తినడానికి తిండలేక, ఉండటానికి నీడ లేక అల్లాడుతున్నం. మీరే మాకు దిక్కు. న్యాయం చేయండి సార్?…’’అంటూ పలువురు లోకాయుక్త బస్తీ దళిత, గిరిజన బాధితులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు మొర పెట్టుకున్నారు.

ఈరోజు మధ్యాహ్నం పెద్ద ఎత్తున ఆయా బస్తీవాసులు మహిళలు, పిల్లలతోసహా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసి బండి సంజయ్ ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వెళ్లబోసుకున్నారు. దాదాపు 70కిపైగా దళిత, గిరిజన కుటుంబాలు 50 ఏళ్లుగా సైదాబాద్ లోని లోకాయుక్త బస్తీలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నాయని… టీఆర్ఎస్, ఎంఐఎం నాయకులు కుట్ర చేసి తమ గుడిసెలను కూల్చివేయించారని వాపోయారు.

3 రోజుల క్రితం అర్ధరాత్రి వచ్చి తమను గుడిసెలనుండి బయటకు పంపించేసి ఆయా గుడిసెలను పీకేయించి తమను నడిరోడ్డుపాల్జేశారని భోరుమన్నారు. తినడానికి తిండిలేక, ఉండటానిక నిలువ నీడ లేక చలిలో వణుకుతున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు మూడు రోజులుగా పస్తులతో ఉన్నారని కన్నీటి పర్యంతమయ్యారు.

బాధితుల ఆక్రందనలు విని చలించిపోయిన బండి సంజయ్ కుమార్ తక్షణ సాయంగా ఆయా కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తక్షణమే బాధితుల పక్షాన పోరాటం చేయాలని భాగ్యనగర్ శాఖ నాయకులను ఆదేశించారు.

అదే సమయంలో బాధితుల పక్షాన న్యాయస్థానంలో పోరాటం చేసేందుకు అండగా నిలవాలని పార్టీ లీగల్ సెల్ బ్రుందాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా బాధితులు బండి సంజయ్ కు క్రుతజ్ఝతలు తెలిపారు. టీఆర్ఎస్ పాలనలో తమ బతుకులు ధ్వంసమయ్యాయని, బీజేపీతోనే తమకు న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.