సోమేష్ కుమార్  స్వచ్ఛందంగా పదవీ విరమణ?

-జగన్‌తో గంటకు పైగానే సోమేష్ కుమార్ భేటీ.. ఫైనల్ డెసిషన్ ఇదేనా..?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో రిలీవ్ అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్  ఏపీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు ఈ భేటీ సాగింది. మీడియాతో మాట్లాడేందుకు సోమేష్ విముఖత వ్యక్తం చేశారు. తాజా పరిణామాలపై జగన్‌ సోమేష్‌ను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి రిపోర్ట్ చేసిన అనంతరం సోమేష్ సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లారు. సోమేష్‌కుమార్ జీఏడీలో  రిపోర్ట్ చేసి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసేందుకు రాజీనామా లేఖను ఇవ్వాలని సోమేష్‌కుమార్ డిసైడ్ అయినట్లు సమాచారం. రాజీనామా అనంతరం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా సోమేష్‌కుమార్‌ను నియమిస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సీఎస్‌ స్థాయి పోస్టులేమీ ఖాళీగా లేవు. ప్రస్తుత ఏపీ సీఎస్ జవహర్ కూడా 2024 జూన్ వరకూ ఈ పోస్టులో కొనసాగేందుకు ఛాన్స్ ఉంది. సీఎంవోలో ఇతర ప్రధాన పోస్టులు కూడా గతేడాది నవంబర్‌లోనే.. అంటే ఇటీవలే భర్తీ కావడంతో సోమేష్ కుమార్‌కు సీఎస్ స్థాయి పోస్టు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేష్ అంతకంటే తక్కువ స్థాయి పోస్టుల్లో విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా లేరు. దీంతో.. రాజీనామా చేసి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించడమే మేలనే అభిప్రాయంలో సోమేష్ కుమార్ ఉన్నట్లు తెలిసింది.సోమేశ్‌ తెలంగాణ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగారని చెప్పొచ్చు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అత్యధిక కాలం పని చేసిన సీఎస్‌గా నిలిచిపోయారు. రాష్ట్రం ఆవిర్భవించిన మొదట్లో సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ శర్మ రెండున్నరేళ్ల పాటు పని చేశారు. తర్వాత ప్రదీప్‌ చంద్ర నెల రోజులు, ఎస్పీ సింగ్‌ 13 నెలల పాటు సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం సీఎస్‌గా నియమితులైన ఎస్‌కే జోషి 23 నెలల పాటు పని చేశారు. తెలంగాణ ఐదో సీఎస్‌గా 2019 డిసెంబర్‌ 31న పదవీ బాధ్యతలు చేపట్టిన సోమేశ్‌ కుమార్‌ గత డిసెంబర్‌ 30 నాటికి మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. మంగళవారం నాటికి ఆయన పదవీ కాలం మూడేళ్ల 11 రోజులు అయ్యింది. ఎక్కువ కాలం పని చేసిన సీఎస్‌గా ఆయన ఉండిపోయారు. ఆయన ఈ సంవత్సరం డిసెంబర్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. అంటే ఇంకా ఏడాది పాటే ఆయనకు సర్వీసు మిగిలి ఉంది. ఇంతలో ఏపీకి వెళ్లాల్సి వచ్చింది.

Leave A Reply

Your email address will not be published.