పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్ పోచారం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కోటగిరి మండలం వల్లవాపూర్ గ్రామంలో సోమవారం జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి  ముఖ్య అథితిగా పాల్గొన్నారు.ఈసందర్భంగా జరిగిన గ్రామ సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాతనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మరే రాష్ట్రంలో లేవు. ప్రధానమంత్రి స్వంత రాష్ట్రం గుజరాత్ లో కూడా లేవు. బాన్సువాడ  నియోజకవర్గానికి పదివేల రెండు పడకల గదుల ఇళ్ళు మంజూరు అయ్యాయి. ఇప్పటికే అయిదువేల ఇళ్ళు నిర్మాణం పూర్తయి లబ్ధిదారులు గృహ ప్రవేశం చేశారు. నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలందరికి స్వంత ఇంటి కలను నిజం చేయడమే నా లక్ష్యం. త్వరలోనే మూడు లక్షల రూపాయల పథకం వస్తుంది. అర్హులైన వారందరికీ ఇల్లు మంజూరు చేయిస్తామన్నారు. దేశంలో అత్యధిక మంది పేదలకు ఆసరా పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వృద్ధులు, వికలాంగులతో పాటుగా వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బోదకాలు బాధితులకు పెన్షన్లను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఆసరా పెన్షన్ల కోసం నెలకు రూ. 1,250 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 15,000 కోట్ల ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్ రూ. 2016 మరియు వికలాంగులకు ఇస్తున్న రూ. 3016 దేశంలోనే అత్యధికం. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వ్యవసాయ రంగానికి రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరంటు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కాంటాలు పెట్టి ధాన్యాన్ని మద్దతు ధరతో కొంటుంది కాబట్టే మార్కెట్ లో ప్రవేటు వ్యాపారులు అధిక ధరకు వడ్లను కొనుగోలు చేస్తున్నారు. లేకపోతే తక్కువ ధరకు కొనేవారని తెలిపారు. మిషన్ భగీరధ పథకం ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందుతుంది. పేదింటి మహిళ వివాహానికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ ద్వారా లక్షా నూట పదహారు రూపాయలు ఇస్తున్నారు. వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతుంటే కొంతమంది ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని సూచించారు. గ్రామంలో లబ్ధిదారులు నూతనంగా నిర్మించుకున్న డబుల్ బెడ్ రూం ఇళ్ళను స్పీకర్ ప్రారంభించారు. అదేవిదంగా మరి కొన్ని ఇళ్ళకు శంకుస్థాపన చేశారు రూ. 30 లక్షలతో నూతనంగా నిర్మించే ఆంజనేయ స్వామి దేవాలయానికి శంకుస్థాపన చేయడం తో పాటు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన చేప విత్తనాన్ని స్పీకర్ పోచారం గ్రామ చెరువులో విడుదల చేశారు.  కార్యక్రమంలో తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.