విపక్షాల ప్రధాని అభ్యర్ధి గా స్టాలిన్‌!?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశ రాజకీయాలు క్రమంగా తమిళనాడు చుట్టూ తిరుగుతున్నాయి. తమిళనాట అధికార డీఎంకేపార్టీ బలంగా ఉండటంతో ఈ సారి వచ్చే ఎంపీ సీట్ల ఆధారంగా ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్‌ను విపక్షాల ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించినా ఆశ్చర్యపడాల్సింది లేదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. స్టాలిన్ 70వ పుట్టినరోజు సందర్భంగా చెన్నై వచ్చిన జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. ఎంకే స్టాలిన్ ప్రధాని ఎందుకు కాకూడదని, ఆయన ప్రధాని అయితే తప్పేంటని ప్రశ్నించారు. భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని, డీఎంకే, స్టాలిన్ భారత ఐక్యతను కాపాడేందుకు కృషి చేస్తున్నారని అబ్దుల్లా కొనియాడారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ భారత్‌ను ఐక్యంగా ఉంచేందుకు పాటుపడుతున్నారని కితాబునిచ్చారు.

మరోవైపు స్టాలిన్ జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. తమిళనాడు, పాండిచ్చేరిలో డీఎంకేను తిరుగులేని శక్తిగా నిలపాలని వ్యూహాలు రచిస్తున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఏర్పడ్డ శూన్యతను భర్తీ చేస్తున్న స్టాలిన్… తన తండ్రి కరుణానిధి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి తమిళనాడు, పాండిచ్చేరిలో పూర్తి స్థాయి ఆధిక్యం కనపరచాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో ఉన్న పొత్తును కొనసాగిస్తూనే మిగతా ప్రాంతీయ తమిళ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మక్కల్ నీతి మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్‌తో స్టాలిన్ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఓట్లు చీలకుండా ఉండేందుకు ఆయన గ్రాండ్ అలయెన్స్ ఏర్పాటు చేసుకునే యోచనలో ఉన్నారు. తద్వారా అన్నాడీఎంకే కూటమికి చెక్ పెట్టాలనేది స్టాలిన్ యోచన.

మరోవైపు అధికారం కోల్పోయినప్పటినుంచీ అన్నాడీఎంకేలో లుకలుకలు పెరిగాయి. పళని స్వామి, పన్నీర్ సెల్వం భిన్న వర్గాలుగా విడిపోయారు. శశికళ ప్రభావం కనిపించడం లేదు. దీంతో డీఎంకేను ఢీకొట్టే అవకాశాన్ని అన్నాడీఎంకే చేజేతులారా కోల్పోయినట్లు అనిపిస్తోందని రాజకీయ పరిశీలకులంటున్నారు.

ఇటు ఇటీవలే రాజీనామా చేసిన యువ ఐపీఎస్ అధికారి అన్నామలై నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. అన్ని వర్గాల ప్రజలనూ అన్నామలై ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటీవల ఓ జవాన్‌ను డీఎంకే కౌన్సిలర్ కొట్టి చంపడంపై అన్నామలై పెద్ద స్థాయిలో ఉద్యమిస్తున్నారు. గవర్నర్‌ను కలవడంతో పాటు మాజీ సైనికులను, మేధావులను, భావ సారూప్యత కలిగిన వ్యక్తులను కలుపుకుని పోతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అన్నామలై బలమైన నేతగా అవతరిస్తే అన్నాడీఎంకేతో పాటు భావసారూప్యత కలిగిన మిగతా పార్టీలు కూడా కూటమిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.