కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీలో రవాణాశాఖ కఠిన చర్యలు

.. 50 లక్షలకు పైగా వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నేపథ్యంలో రవాణాశాఖ కఠినంగా వ్యవహరిస్తున్నది. అత్యధికంగా పొల్యూషన్‌ వెలువడే వాహనాలపై కొరఢా ఝుళిపిస్తున్నది. ఈ నెల 17 వరకు ఢిల్లీలో 50లక్షలకుపైగా వాహనాల రిజిస్ట్రేషన్లను రవాణాశాఖ రద్దు చేసింది. ఇందులో చాలా వరకు 15 సంవత్సరాలు పైబడిన పెట్రోల్‌ ఇంజిన్‌ వాహనాలు, పది సంవత్సరాలకుపై బడిన డీజిల్‌ ఇంజిన్‌ వాహనాలున్నాయి. 2018 నుంచి ఈ నెల 17 మధ్య దేశ రాజధానిలో 53.38లక్షల వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు రవాణాశాఖ నివేదికలు తెలిపాయి.ఇందులో 46లక్షలకుపైగా వాహనాలు పెట్రోల్‌తో నడిచేవి కాగా.. 15 సంవత్సరాల కంటే పాతవిగా గుర్తించారు. మరో 4.15లక్షలు డీజిల్‌ వాహనాలున్నాయి. ఇకపై రిజిస్ట్రేషన్లు రద్దయిన వాహనాలను ఢిల్లీ రోడ్లపై నడిపేందుకు చట్టబద్ధంగా అనుమతి ఉండదు. ఈ చర్య రోడ్లపై రద్దీని తగ్గించడంతో పాటు కొత్త వాహనాల కొనుగోళ్లను పెంచేందుకు సహాయపడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కానీ, ప్రధాన లక్ష్యం మాత్రం ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారకుండా చూసుకోవడమేనని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో 15 ఏళ్లు పైబడిన పెట్రోల్‌ వాహనాలు, పదేళ్లు పైబడిన డీజిల్‌ వాహనాలపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే, వాహనాలను నడిపేందుకు అథరైజ్డ్‌ సెంటర్‌ నుంచి ఫిట్‌నెస్‌ సర్టిఫెట్‌ తీసుకునే సౌలభ్యం ఉన్నది. అయితే, ఇది ఖరీదైన ప్రక్రియ. ఇది కాకుండా వెహికిల్‌ స్క్రాపేజ్‌ పాలసీతో కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రోత్సాహకాలు పొందే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా.. జనవరి 31, 2022 నాటికి రాజధాని నగరంలో 13.4 మిలియన్ల వాహనాలు రోడ్లపై తిరుగుతుండగా.. వాటిలో 7.8 మిలియన్ల వాహనాలు యాక్టివ్‌గా ఉన్నట్లు భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.