మణిపూర్‌ ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం

-  సుమోటోగా స్వీకరించిన ధర్మాసనం..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మణిపూర్‌లో కుకీ తెగకు చెందిన మహిళను నగ్నంగా ఊరేగించిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దాడి ఘటనను మణిపూర్‌ మహిళలపై అమానవీయ చర్యలను ఖండించింది. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీసింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే తామే చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.మణిపూర్‌లో చెలరేగిన అల్లర్ల మాటున మహిళలపై దారుణాలు జరుగుతున్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన తాజాగా బయటపడింది. మే 4న కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో అక్కడి మహిళలు తీవ్ర వ్యధను అనుభవించారు. ఓ వర్గం వారు ప్రత్యర్థి వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేశారు. అనంతరం వారిని గ్రామ వీధుల్లో ఊరేగించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారి ఆర్తనాదాలను ఎవరూ పట్టించుకోకుండా వికృతంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి కారణంగానే దారుణాలు జరుగుతున్నట్టు పలువురు మండిపడుతున్నారు.

ఆ వీడియోలు తొలగించండి.. కేంద్రం ఆదేశాలు

ఈ క్రమంలో మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్‌ కావడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వీడియోలను వెంటనే తొలగించాలని ట్విట్టర్‌తో సహా ఇతర అన్ని సోషల్‌ మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. శాంతి భద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా తక్షణమే వీడియోలను తొలగించాలని ఆదేశించింది. భారతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని సూచించింది.

మణిపూర్‌ను కాపాడండి: మంత్రి కేటీఆర్‌

‘తాలిబన్ లు పిల్లలను, మహిళలను అగౌరవపరుస్తున్నప్పుడు భారతీయులమైన మనము వారిపై విరుచుకుపడుతున్నాము. అలాంటిది, ఇప్పుడు మనదేశంలోనే మణిపూర్ లో కుకీ తెగ స్త్రీలను మైతీలు నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేయడం బాధాకరం. కొత్త భారతదేశంలో అనాగరిక చర్యలు విచారకరం. ఈ భయానక హింసాకాండ, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడాన్ని కేంద్రం మౌనంగా చూస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ.. అమిత్‌షా జీ ఎక్కడ ఉన్నారు? దయచేసి అన్నింటినీ పక్కన పెట్టండి. మీ సమయాన్ని, శక్తిని మణిపూర్‌ను రక్షించడం కోసం వినియోగించండి’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.