అమరావతి కేసుల అంశంలో ఏపీ ప్రభుత్వానికి  సుప్రీంకోరు షాక్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/అమరావతి: రాజధాని అమరావతి కేసుల అంశంలో ఏపీ ప్రభుత్వానికి  సుప్రీంకోరు షాకిచ్చింది. అమరావతి రాజధాని కేసుల విచారణ త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మరోసారి చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. గతంలో చెప్పినట్టుగా మార్చి 28నే విచారణ చేపడతామని స్పష్టం చేసింది.అయితే మార్చి 28 ఒక్కటే సరిపోదని.. మార్చి 29 30 తేదీల్లో కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 29 30 తేదీలు బుధ గురువారాలని.. కాబట్టి నోటీసులు ఇచ్చిన కేసులను ఈ తేదీల్లో విచారించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. కాబట్టి మార్చి 29 30తేదీల్లో ఆ రెండు రోజుల్లో విచారణ తన చేతుల్లో లేదని ధర్మాసనం తేల్చిచెప్పిందవి. ఈ రెండు రోజుల్లో విచారణ విషయంలో సీజేఐ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ కేఎం జోసెఫ్ తెలిపారు.అమరావతి రాజధాని కేసు చాలా పెద్దదని..  అన్ని అంశాలూ పరిశీలించి తీర్పు ఇవ్వాల్సి ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ తెలిపారు. అలా చేస్తేనే సార్థకత ఉంటుందన్నారు. దీనిలో రాజ్యాంగ సంబంధిత అంశాలు చాలా ఇమిడి ఉన్నాయన్నారు. అంతకుమించి ఈ కేసుకు సంబంధించి తానేమీవ్యాఖ్యానించలేనని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా అందుకు కూడా ధర్మాసనం నిరాకరించింది.కాగా అమరావతి కేసులను విచారణ జాబితాలో త్వరగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గత సోమవారమే జస్టిస్ కేఎం జోసెఫ్ జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ప్రస్తావించిన సంగతి తెలిసిందే. వీటిపై స్పందించిన ధర్మాసనం మార్చి 28న విచారణ చేపడతామని వెల్లడించింది. అయితే రోజులు తిరగక ముందే మరోసారి కేసులు త్వరగా విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో మూడు రాజధానులను తెచ్చిన సంగతి తెలిసిందే. శాసన రాజధానిగా అమరావతి కార్య నిర్వాహక రాజధానికిగా విశాఖ న్యాయ రాజధానిగా కర్నూలును ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించి జీవోలను కూడా విడుదల చేశారు. అయితే వీటిని ఏపీ హైకోర్టు కొట్టేసింది. రాజధానిని మార్చే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. దీంతో జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Leave A Reply

Your email address will not be published.