వైఎస్ వివేకా హత్య కేసు విచారణపై సుప్రీం కీలక నిర్ణయం

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : వైఎస్ వివేకా హత్య కేసు విచారణపైన సుప్రీం కోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. ఏపీలో విచారణ పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ మరో రాష్ట్రానికి విచారణ బదిలీ చేయాలని వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఏపీలో నిర్వహిస్తున్న విచారణపైన నమ్మకం లేదన్నారు. దీని పైన సీబీఐను కౌంటర్ దాఖలు చేయాలంటూ సుప్రీం కోర్టు సూచించింది. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ లో సునీత పేర్కొన్న అంశాలతో ఏకీభవించింది. విచారణాధికారిపైనే నిందితులు కేసులు పెట్టారని సీబీఐ పేర్కొంది.
ఏపీలో కేసు విచారణ జాప్యం అవటానికి కారణాలను వివరిస్తూ..సునీత పేర్కొన్న అంశాలనే మరోసారి ప్రస్తావించింది. సునీత న్యాయవాది తమ వాదనల్లో కాలపరిమితితో విచారణ జరగాలని కోరారు. కేసులో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. సాక్షుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కోర్టుకు నివేదించారు. కొందరు దర్యాప్తు ప్రభావితం అయ్యేలా వ్యవహరిస్తున్నారని న్యాయస్థానం ముందు వాదన వినిపించారు. ఈ పిటీషన్ కు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయటానికి సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. దీనికి ముందు ఏ రాష్ట్రానికి కేసు బదిలీ చేయాలని కోరుకుంటున్నారని పిటీషనర్ తరపు న్యాయవాదితో పాటుగా ప్రతివాదులను ప్రశ్నించింది. తెలంగాణకు మాత్రం బదిలీ చేయవద్దంటూ సీబీఐ కోరినట్లుగా తెలుస్తోంది. కానీ, సునీత తరపు న్యాయవాదులు మాత్రం తెలంగాణకు బదిలీ చేసినా తమకు ఫర్వాలేదని కోర్టుకు నివేదించారు. అయితే, కేసు ఏ రాష్ట్రంకు బదిలీ చేస్తారనే అంశం పైన సుప్రీం కోర్టు ఆదేశాలను వచ్చే శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.