చేరికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్.. ఢిల్లీకి బండి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇతర పార్టీల నుంచి చేరికలపై తెలంగాణ బీజేపీ దృష్టి సారించింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. హైకమాండ్ పిలుపుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హుటాహుటిన హస్తినకు పయనమయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై ఢిల్లీ పెద్దలకు నివేదక ఇవ్వనున్నారు. అలాగే బీఆర్‌ఎస్నుంచి సస్పెండ్ అయిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక అంశంపై ఢిల్లీ పెద్దలతో బండి చర్చించే అవకాశం ఉంది. మరోవైపు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.ఇటీవల బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్‌కు గురైన జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను బీజేపీలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే విషయంపై తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు. బీజేపీలో ఇరువురి నేతల చేరికపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో తాజా పరిస్థితులపై బీజేపీ హైకమాండ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. జూపల్లి, పొంగులేటిని పార్టీలో చేర్చుకోవడం ఎంతో ప్రయోజకరమని, అంతే కాకుండా ఇతర అసంతృప్తి నేతలు కూడా చేరే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జూపల్లి, పొంగులేటి చేరికలను కమలం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Leave A Reply

Your email address will not be published.