దేశంలోనే తెలంగాణ వివిధ రంగాల్లో గుణాత్మక అభివృద్ధి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జాతీయ రక్షణ కళాశాల ప్రతినిధి బృందం నేడు బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శాంతికుమారి తో సమావేశమైంది. ప్రతినిధి బృందానికి స్వాగతం పలికిన ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి వారికి వివరించారు.దేశంలోనే తెలంగాణ అత్యంత చిన్న రాష్ట్రమైనప్పటికీ, వివిధ రంగాల్లో గుణాత్మక అభివృద్ధి పొందిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. వేసవిలో కూడా పరిశ్రమలకు, వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరాను అందిస్తున్నామని చెప్పారు. తద్వారా,  వ్యవసాయంలో అద్వితీయమైన పురోగతి సాధించామని, ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి సాధించామని వివరించారు. రాష్ట్రంలో 2014 లో 5 .05 లక్షల కోట్ల రూపాయలు ఉన్న జి.ఎస్.డి.పి. 2022 -2023 నాటికి 13 .27 లక్షల కోట్లకు చేరుకుందని, అదేవిధంగా రూ.1 .24 లక్షలు ఉన్న తలసరి ఆదాయం రూ 3 .17 లక్షలకు చేరుకుందని వెల్లడించారు.  ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు అనేక విధానాలు ప్రారంభించామని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని, దీని ఫలితంగా రాష్ట్రంలో అనేక గ్రోత్ సెంటర్లు అభివృద్ధి చెందాయని వివరించారు. అదేవిధంగా పట్టణ అభివృద్ధిని ప్రోత్సహించడానికి అనేక కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను  ఏర్పాటు చేశామని అన్నారు. మిషన్ భగీరథ పథకం తాగునీటి సమస్యను తగ్గించడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను పరిష్కరించడంలోనూ దోహదపడిందని తెలిపారు.. ఆరోగ్య రంగంలో వివిధ అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలలో తెలంగాణా ఒకటని పేర్కొన్నారు.      ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన హరితహారం కార్యక్రమం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 270 కోట్ల మొక్కలు నాటడం ద్వారా 7.7 శాతం గ్రీన్ కవర్‌ను పెంచడానికి సహాయపడిందని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. దృఢమైన, దార్శనికత కలిగిన నాయకత్వం వల్లనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని జాతీయ రక్షణ కళాశాల ప్రతినిధి బృందం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, పథకాల ద్వారా అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలకు సాధికారత కల్పించడంతోపాటు టి-హబ్, ఇతర కార్యక్రమాల ద్వారా సాంకేతికతను వినియోగించుకోవడం అభినందనీయమన్నారు. సందర్బంగా  ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, పీఆర్‌ ఆర్‌డీ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్ సుల్తానియా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి  క్రిస్టినా జోంగ్తు, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఇతర ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ శాఖల ద్వారా అమలవుతున్న పధకాలను వివరించారు. ఫ్యాకల్టీ ఇంఛార్జి ప్రియాంక్ భారతి నేతృత్వంలోని ఎన్‌డిసి ప్రతినిధి బృందం భారతదేశ అధ్యయన పర్యటనలో భాగంగా హైదరాబాదుతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పర్యటిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.