‘అవతార్ 2’కు డైలాగ్స్ రాసిన తెలుగు డైరెక్టర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ‘అవతార్2’(Avatar 2) మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే వరల్డ్ ప్రీమియర్‌లో ఈ సినిమాను వీక్షించిన హాలీవుడ్ క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూస్‌ ఇచ్చారు. ఊహించని విజువల్ వండర్స్‌తో మేకర్స్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారంటూ ‘మాస్టర్ పీస్’గా వర్ణించారు. దీంతో ప్రేక్షకుల్లో ‘అవతార్2’పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న విడుదలవుతుండగా.. ఇండియాలోనూ భారీ సంఖ్యలో థియేటర్లు కేటాయించారు. ఇదిలా ఉంటే సినిమాను పలు భారతీయ భాషల్లోకి అనువదించారు. ఈ నేపథ్యంలోనే తెలుగు వెర్షన్‌కు టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్(Avasarala Srinivas) డైలాగ్స్ రాశారని సమాచారం.

‘అష్టా చమ్మా’ సినిమాతోర తెలుగు ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమయ్యారు శ్రీనివాస్. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకోవడంతో వరుస అవకాశాలు అందుకున్నాడు. ఇదే క్రమంలో డైరెక్షన్ వైపు ఫోకస్ చేసిన శ్రీనివాస్.. యంగ్ హీరో నాగశౌర్య, రాశీ ఖన్నా జంటగా ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రాన్ని రూపొందించారు. అలా మొదటి సినిమాతోనే సెన్సిబుల్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నాగశౌర్య, నారా రోహిత్ హీరోలుగా రెజీనా కథానయికగా ‘జ్యో అచ్యుతానంద’ పేరుతో మరో సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రానికి 2014లో స్పెషల్ జ్యూరీ నంది అవార్డు గెలుచుకున్న శ్రీనివాస్.. ‘జ్యో అచ్యుతానంద’ చిత్రానికి గాను బెస్ట్ డైలాగ్ రైటర్‌గా 2016లో నంది అవార్డు సొంతం చేసుకున్నారు.

చివరగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంలో నటుడిగా కనిపించిన శ్రీనివాస్ ప్రస్తుతం ‘పలానా అబ్బాయి పలానా అమ్మాయి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, దాసరి పద్మ నిర్మాతలు. నాగశౌర్య హీరోగా తెరకెక్కనున్నన ఈ సినిమాలో జెమీ లీ బీచర్, మాళవిక నాయర్, మనోజ్ ఆనంద్, ప్రియా టేలర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాకు సునీల్ కుమార్ నామ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇక అవతార్2 తెలుగు రిలీజ్ విషయానికొస్తే.. ఇద్దరు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లు కలిసి భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. అవతార్ ఫస్ట పార్ట్‌ వరల్డ్ వైడ్‌గా సాధించిన పాపులారిటీ దృష్ట్యా.. సెకండ్ పార్ట్ అంతకు మించిన వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. 25 కోట్ల అమెరికన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ హాలీవుడ్ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచనుందని క్రిటిక్స్‌తో పాటు ఈ మూవీ మేకర్స్ కూడా చెబుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.