ఢిల్లీ లిక్కర్‌ కేసులో టెన్షన్.. టెన్షన్.. 

- మరోసారి.. ఎమ్మెల్సీ కవిత పేరు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఒకరిద్దరితో మొదలైన అరెస్ట్‌లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఉదయం వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను 10 రోజులపాటు ఈడీ కస్టడీకి కూడా కోర్టు అనుమతిచ్చింది. అయితే రాఘవరెడ్డి రిమాండ్‌ రిపోర్టు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కి ఎక్స్‌క్లూజివ్‌గా చిక్కింది. ఈ రిపోర్టు బయటికి రావడంతో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ కేసులో మొదట్నుంచీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి రిపోర్టులో బయటికి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో కవిత ప్రతినిధిగా అరుణ్‌పిళ్లై ఉన్నారని ఈడీ పేర్కొంది. మరోసారి కవిత పేరు రావడంతో బీఆర్ఎస్ (BRS) శ్రేణుల్లో ఆందోళన మరింత పెరిగిపోయింది.

మరోవైపు.. ఎన్రికా ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో రాఘవ లిక్కర్‌ కార్యకలాపాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తేల్చారు. ఢిల్లీ లిక్కర్‌ కార్యకలాపాలన్నీ రాఘవ నిర్వహించేవారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా మాగుంట రాఘవ కలిశారని చెబుతున్నారు. రూ.100 కోట్లు లంచం ఇచ్చిన సౌత్‌గ్రూప్‌లో రాఘవ కీలకంగా ఉన్నారని రిమాండ్ రిపోర్టు లో ఈడీ అధికారులు స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ వర్గాల్లో టెన్షన్.. టెన్షన్

తాజా పరిస్థితిని బట్టి చూస్తే.. ఈ లిక్కర్‌ స్కామ్‌తో కవిత పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలోనే 28 సార్లు కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలో.. కవిత, మాగుంట రాఘవ్‌, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, ఆడిటర్‌ బుచ్చిబాబు, పెర్నార్డ్‌ రికార్డ్‌కు చెందిన బినయ్‌ బాబు పలుమార్లు ఆప్‌ నేతలతో భేటీ అయ్యారని, హోల్‌సేల్‌, రిటైల్‌ ఉత్పత్తిదారులతో కుమ్మక్కై కార్టెల్‌(సిండికేట్‌)ను ఏర్పాటు చేశారని స్పష్టం చేసింది. కవిత, మాగుంట రాఘవ్‌, శరత్‌రెడ్డి నిర్వహిస్తున్న సౌత్‌గ్రూప్.. ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిందని దినేశ్‌ అరోరా వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ పేర్కొంది. అరుణ్‌పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబులు సౌత్‌గ్రూ‌ప్ తరఫున ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా.. మాగుంట రాఘవను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో రేపొద్దున ఏం జరుగుతుందో ఏమో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

Leave A Reply

Your email address will not be published.