రష్యా దేశంలో ప్రార్థన మందిరాలపై ఉగ్రదాడి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రష్యాలో ఆదివారం రాత్రి ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. పలుచోట్ల ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ఓ చర్చి ఫాదర్, పోలీసుల సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. డాగేస్థాన్‌లోని ఉత్తర ప్రాంతంలో సాయుధ మిలిటెంట్లు రెండు చర్చిలు, ఓ యూదుల ప్రార్థనామందిరం, పోలీస్ పోస్టుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. డాగేస్థాన్‌లోని అతిపెద్ద నగరం మఖ్చకల, డెర్బెంట్‌ నగరాల్లో ఏకకాలంలో దాడులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ చేపట్టి.. ఆరుగుర్ని మట్టుబెట్టాయి. మఖ్చకల్‌లో నలుగురు, డెర్బెంట్‌లో ఇద్దరు మిలిటెంట్లను హతమార్చినట్టు డాగేస్థాన్ గవర్నర్ సెర్గే మెలికోవ్ ప్రకటించారు. దీనిని ఉగ్రవాదుల చర్యగా ఆయన అభివర్ణించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీస్ అధికారులు, పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. గత నలభై ఏళ్లుగా డెర్బెంట్‌ ఆర్థోడాక్స్ చర్చి ఫాదర్‌గా ఉన్న వ్యక్తిని కూడా కాల్చి చంపారని అన్నారు. ఇక, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ ముగిసినట్లు రష్యా ‘జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ (NAC)’ వెల్లడించింది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, ఘటన జరిగిన ప్రాంతాలు పూర్తిగా భద్రతా బలగాల అధీనంలో ఉన్నాయని పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.