జగన్ ను అందుకే పొడిచా

- కోడి కత్తి కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన నిందితుడు!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 2018లో విశాఖ విమానాశ్రయంలో నాటి ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. జగన్ ను హత్య చేయడానికి ప్రయత్నించారని.. టీడీపీ నేత రెస్టారెంటులో నిందితుడు శ్రీనివాసరావు పనిచేస్తున్నాడని.. టీడీపీ నేత హర్షవర్దన్ చౌదరే నిందితుడికి కత్తి ఇచ్చి పంపాడని జగన్ తోపాటు వైసీపీ నేతలు అప్పట్లో ఆరోపించారు. జగన్ అధికారంలోకి రావడానికి ఈ కోడి కత్తి కేసు కూడా కీలక పాత్ర పోషించింది.తాజాగా విజయవాడ కోర్టులో ఇందులో కుట్ర కోణం ఏమీ లేదని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) తెలిపింది. పూర్తి స్థాయిలో ఈ కేసును విచారించిన తర్వాతే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నామని పేర్కొంది. జగన్ ఆరోపిస్తున్నట్టు టీడీపీ నేతలకు కానీ ఆ పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదని ఎన్ఐఏ విజయవాడ కోర్టుకు నివేదించింది.ఈ మేరకు నిందితుడు శ్రీనివాసరావు వెల్లడించిన విషయాలను కూడా ఎ¯Œ ఐఏ కోర్టుకు తెలిపింది. గతంలో విచారణలో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటలను చార్జిషీట్ కౌంటర్ ఈ–స్టేట్మెంట్ ను ఎన్ఐఏ జత చేసింది.‘‘నేను మొదటి నుంచి వైఎస్సార్ అభిమానిని. జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్నాను. ప్రజల్లో సానుభూతి కోసం జగన్ పై కోడి కత్తితో దాడి చేశాను. ఇలా చేస్తే మీడియా ద్వారా జగన్ పై సానుభూతి పెరుగుతుందని భావించాను. ఈ క్రమంలో జగన్ కు  ప్రమాదం జరగకుండా కోడికత్తిని 2 సార్లు స్టెరిలైజ్ చేయించా. జగన్ కు టీ ఇచ్చేందుకు వెళ్లి ఈసారి ఎన్నికల్లో 160 సీట్లతో గెలుస్తారని కూడా ఆయనకు చెప్పాను. నా మాటలకు ఆయన నవ్వారు. కోడి కత్తితో జగన్ పై దాడి చేసిన వెంటనే వైసీపీ నేతలు నాపై దాడి చేశారు. అక్కడే ఉన్న పోలీసులు నన్ను కాపాడి ఓ గదిలో బంధించారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు’ అని నిందితుడు శ్రీనివాసరావు ఎన్ఐఏ విచారణలో వెల్లడించాడు.‘‘ అప్పట్లో ఆంధ్రా పోలీసులు నన్ను బాగా కొట్టారు. ఈ సంఘటన వెనుక ఎవరున్నారని అడిగారు. నా సొంత ఆలోచనతోనే దాడికి పాల్పడ్డానని చెప్పాను. ఎన్నిసార్లు అడిగినా ఇదే విషయం చెప్పాను. కట్టు కథలు చెప్పాలని పోలీసులు నాపై ఎటువంటి ఒత్తిడి తేలేదు. ఏ పార్టీకి అనుకూలంగా గానీ వ్యతిరేకంగా గానీ చెప్పాలని బెదిరించలేదు. అందువల్లే జడ్జి దగ్గర నేను పోలీసులపై ఏ ఆరోపణలు చేయలేదు’ అని నిందితుడు శ్రీనివాసరావు వివరించాడు.‘‘నేను గతంలో సింహాచలం దేవస్థానానికి వెళితే దేవుడి దర్శనానికి రూ.200 అడిగారు. హోటల్ పెట్టుకుందామంటే కనీసం లోన్ కూడా ఇవ్వలేదు. ఇటువంటి ఘటనలతో నాకు అసహనం పెరిగింది. ఇదే అంశంపై నేను 24 పేజీల పుస్తకం కూడా రాశాను. పుస్తకం పూర్తి చేద్దామంటే విశాఖ జైలు సిబ్బంది లాగేసుకున్నారు. జగన్ పై దాడి చేయడం తప్పు అని నాకు తెలుసు. జగన్ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు తీరతాయనే ఇలా చేశాను. ఇందుకు జగన్ సార్ ని నా తల్లిదండ్రులను క్షమాపణ కోరుతున్నాను’’ అని శ్రీనివాసరావు ఎన్ఐఏ విచారణలో వివరించాడు. ఇవే అంశాలను విజయవాడ ఎన్ఐఏ కోర్టు దృష్టికి ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్లారు. కోడి కత్తి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని వెల్లడైనందున ఈ కేసులో విచారణ ముగించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.