బోగీలోని విద్యుత్ తీగల లోపాల వల్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం

-    ప్రమాదానికి సంబంధించి ఆధారాలు సేకరించిన క్లూస్ టీం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు వద్ద క్లూస్ టీం విచారణ ముగిసింది. ప్రమాదానికి సంబంధించి ఆధారాలు సేకరించినట్లు క్లూస్ టీం తెలిపింది. ఎస్4 బోగీలోని బాత్రూమ్ వద్ద ముందుగా పొగలు వ్యాపించాయని క్లూస్ టీం నిర్ధారించింది. బోగీలోని విద్యుత్ తీగల లోపాల వల్లే ప్రమాదం సంభవించినట్లుగా గుర్తించారు. ఎస్4 బోగీలోని మంటలు ఇతర బోగీలకు వ్యాపించాయని అధికారులు నిర్ధారించారు. కరెంటు తీగల లోపాల వల్లే ప్రమాదం సంభవించిందని, ఆధారాలన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు అందిస్తామని అధికారులు వెల్లడించారు.కాగా.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదంపై అధికారులు కేసు నమోదు చేశారు. నల్గొండ జి.ఆర్.పి స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం జరిగిందని నిర్ధారించి కేసు నమోదు చేశారు. యాదాద్రి వద్ద హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. పగిడిపల్లి – బొమ్మాయిపల్లి వద్ద రైలు బోగీల్లో మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తొలుత భావించారు.ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మొత్తం ఆరు బోగీలు దగ్ధమయ్యాయి. ఎస్-4, ఎస్-5, ఎస్-6, ఎస్-7 బోగీలు కాలి బూడిదయ్యాయి. బోగీల్లో పొగ గమనించగానే లోకో పైలెట్ ట్రైన్‌ను నిలిపివేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులంతా రైలు దిగి వెళ్లిపోయారు. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. అగ్నిప్రమాదానికి గురైన బోగీలను రైలు నుంచి విడదీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడ్డారని సౌత్‌ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది

Leave A Reply

Your email address will not be published.