ప్రాణాలకు తగ్గించి ఎడ్లను కాపాడిన అన్నదాత

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: విజయనగరం జిల్లా పెదకొదమకు చెందిన తిరుపతిరావు అనే రైతు తనకున్న నాటుబండినే జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. తన వద్ద ఉన్న నాటుబండితో పొలం పనులతో పాటు భవన నిర్మాణాలకు ఇసుక తరలిస్తూ బ్రతుకు బండి ఈడుస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఎప్పటిలాగే తన నివాసం నుండి ఇసుక కోసం వంశధార నదికి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అకస్మాత్తుగా ప్రక్కనే ఉన్న పంట పొలాల నుండి ఆరు ఏనుగులు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చాయి. అప్పుడే సమీపంలో ఉన్న తిరుపతిరావు నాటుబండిని చూసిన ఏనుగులు పరుగుపరుగున బండి వద్దకు వచ్చాయి. ఏనుగుల గుంపు రెచ్చిపోయి ఘీంకారాలు చేస్తూ రావడం గమనించాడు తిరుపతిరావు. వెంటనే భయంతో పారిపోకుండా హుటాహుటిన బండిపై నుండి క్రిందకి దూకి బండి నుండి రెండు ఎద్దులను వేరు చేసే ప్రయత్నం చేశాడు.

అప్పటికే ఏనుగులు నాటుబండి పై దాడికి దిగాయి. అయినా సరే ఎలాగైనా ఎద్దులను కాపాడాలని ఏనుగులు బండిపై దాడి చేస్తున్నప్పటికీ సాహసోపేతంగా ప్రాణాలకు సైతం తెగించి ఎద్దులను వేరు చేసి వెంటనే ప్రక్కనే ఉన్న పంట పొలాల్లోకి పారిపోయాడు. మరోవైపు ఎద్దులు కూడా పరుగు లంకించి ప్రాణాలు కాపాడుకున్నాయి. అలా రైతు చాకచక్యంగా వ్యవహరించడంతో ఇటు రైతుతో పాటు అటు రెండు ఎద్దుల ప్రాణాలు కూడా నిలిచాయి. అయితే ఏనుగుల దాడిలో తన నాటుబండి మాత్రం నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో జీవనాధారంగా ఉన్న నాటుబండి ధ్వంసం అవ్వడంతో లబోదిబోమని కన్నీరు పెట్టుకున్నాడు రైతు. ఇప్పటికైనా ఏనుగులను దూరప్రాంతాలకు తరలించి తమను కాపాడాలని కోరుతున్నారు జిల్లావాసులు.

Leave A Reply

Your email address will not be published.