మునుగోడు ఆర్ ఓ పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ సమీపిస్తున్నకొద్దీ మునుగోడులో రాజకీయాలు కాక రేపుతున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు అందరూ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే ఇండిపెండెంట్లు కూడా మేమేం తక్కువ కాదంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇక మరోవైపు మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో కేటాయించిన గుర్తుల విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుర్తు విషయంలో చేసిన ఒక పని ఇప్పుడు రచ్చ గా మారింది. మునుగోడులో యుగతులసి పార్టీకి చెందిన అభ్యర్థి శివకుమార్ కు ఎన్నికల సంఘం రోడ్ రోలర్ గుర్తును కేటాయించింది. అయితే ఆ తర్వాత రోడ్ రోలర్ గుర్తు కారు గుర్తును పోలి ఉందని టిఆర్ఎస్ పార్టీ కోర్టుకు కూడా వెళ్ళింది. ఒక్క రోడ్డు రోలర్ మాత్రమే కాక, మరో ఏడు గుర్తులు కూడా కారు గుర్తును పోలి ఉన్నాయని వాటిని మార్చాలని కోర్టును ఆశ్రయించినా టీఆర్ఎస్ పార్టీకి ఫలితం లేకపోయింది. కోర్టు విచారణలో టీఆర్ఎస్ అభ్యర్ధనను కొట్టిపారేసింది. ఇదిలా ఉండగానే యుగ తులసి పార్టీ కేటాయించిన రోడ్ రోలర్ గుర్తును మార్చి మళ్లీ బేబీ వాకర్ గుర్తును కేటాయించారు. మునుగోడు రిటర్నింగ్ అధికారి ఈ పని చేశారు.

దీంతో తనకు మొదట రోడ్డు రోలర్ గుర్తును కేటాయించారని, ఆ తర్వాత బేబీ వాకర్ గుర్తుగా మార్చారని ఈనెల 17వ తేదీన యుగ తులసి పార్టీ అభ్యర్థి కే. శివ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గుర్తును మార్చటం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మునుగోడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం అసహనం వ్యక్తం చేసింది.
తనకు లేని అధికారాలతో రిటర్నింగ్ అధికారి గుర్తును మార్చడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల అధికారి కి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అంతేకాదు యువతులకు పార్టీకి చెందిన శివకుమార్ కు కేటాయించిన బేబీ వాకర్ స్థానంలో మళ్లీ రోడ్ రోలర్ గుర్తును కేటాయించాలని, రాష్ట్ర ఎన్నికల అధికారికి మునుగోడు రిటర్నింగ్ అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.