మూడు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన బృందం మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నది. మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సారథ్యంలోని 17 మంది అధికారుల బృందం హోటల్‌ తాజ్‌కృష్ణాలో బస చేయనుంది.అక్కడే సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తుంది. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశమవుతుంది. కాగా, సీఈసీ బృందం రాకతో అతిత్వరలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానున్నట్టు స్పష్టమైంది. రాష్ట్రానికి విచ్చేసిన ఎన్నికల అధికారుల బృందంలో ఎలక్షన్‌ కమిషనర్‌ అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌, సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీశ్‌కుమార్‌ వ్యాస్‌, డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు అజయ్‌ భాడూ, హిర్దేశ్‌కుమార్‌, ఆర్కే గుప్తా, మనోజ్‌కుమార్‌ సాహూ తదితరులు ఉన్నారు.సీఈసీ బృందంలోని అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సన్నద్ధతపై ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థలతో సమీక్షిస్తారు. జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓలు), ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో సమావేశమవుతారు. ప్రభుత్వపరంగా అందిస్తున్న సహకారంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోనూ ఈ బృందం ప్రత్యేకంగా సమావేశమవుతుంది. పర్యటన చివరలో పత్రికా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించనుంది.

Leave A Reply

Your email address will not be published.