ఉల్లి ధరల పెరుగుదలను నియంత్రించేందుకు రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో ఉల్లి ధరల మోత మోగుతోంది. మొన్నటివరకు కిలో ఉల్లి రూ.30-రూ.40 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ. 80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యుల జేబులకు ఉల్లి చిల్లు వేస్తోంది. ఈ క్రమంలోనే ఉల్లి ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా బఫర్ స్టాక్ నుంచి రిటైల్ మార్కెట్లలోకి లక్ష టన్నుల ఉల్లిని విడుదల చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉల్లి ధరలను తగ్గించడం కోసం ఎగుమతులపై ఆంక్షలు విధించింది.దేశవ్యాప్తంగా కిలో ఉల్లిని సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం రూ.25 కే విక్రయిస్తోంది. దీనికి తోడు ఈ నెలలోనే మార్కెట్లలోకి బఫర్ స్టాక్ నుంచి లక్ష టన్నుల ఉల్లిని రిలీజ్ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇక దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో హోల్‌సేల్ కిలో ఉల్లి ధర రూ. 30 కి పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత తగ్గనున్నాయని దీంతో సామాన్యుడికి భారీ ఊరట లభిస్తుందని పేర్కొంటున్నాయి.కేంద్ర ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా ఉల్లిని విక్రయించడం వల్ల దేశంలోని ప్రముఖ నగరాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయని అధికార వర్గాలు చెప్పాయి. ఇండోర్, భోపాల్, రాయ్‌పూర్, జైపూర్ వంటి నగరాల్లో ఉల్లి ధరలు తగ్గినట్లు స్పష్టం చేశాయి. ఇక పండ్లు, కూరగాయలకు ఆసియాలోనే అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండిలో కిలో హోల్‌సేల్ ఉల్లి పాయల ధర ఇటీవల రూ. 60-రూ.65 లు ఉండగా ప్రస్తుతం అది రూ. 30 నుంచి రూ.40 కి పడిపోయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు భారీగా తగ్గినా.. దాని ప్రభావం రిటైల్ మార్కెట్‌లలో ఇంకా కనిపించడం లేదని మార్కెట్ వర్గాలతోపాటు వినియోగదారులు పేర్కొంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తీసుకున్న చర్యలతో రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఉల్లి ధరలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.దేశంలో ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు ఉల్లి ఎగుమతులపై ఆంక్షలను విధించింది. దీనికి తోడు ఇప్పుడిప్పుడే ఖరీఫ్‌లో పండించిన ఉల్లి పంట మార్కెట్లోకి రావడం.. మార్కెట్లోకి లక్ష టన్నుల ఉల్లి నిల్వలను కేంద్రం విడుదల చేస్తామని ప్రకటించడంతో హోల్‌సేల్ ఉల్లి ధరలు భారీగా పడిపోయాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి

Leave A Reply

Your email address will not be published.