అప్పులకుప్పగా మారుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి

  తాజాగా మరో రూ.5858 కోట్ల అప్పును తీసుకున్న సర్కార్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులకుప్పగా మారుతోంది. ఏపీ ప్రభుత్వం మరోసారి కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తీసుకొచ్చింది. తాజాగా మరో రూ.5858 కోట్ల అప్పును ఏపీ సర్కార్ తీసుకుంది. అదనపు అప్పుకు కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకు గానూ.. అదనంగా 0.5% రుణాలు పొందేందుకు రాష్ట్రాలకు కేంద్రం అవకాశం కల్పించింది.విద్యుత్‌ సంస్కరణల్లో ప్రధానంగా మూడు అంశాలను అమల్లోకి తీసుకువచ్చినందుకు గానూ కేంద్ర ఆర్థిక శాఖ ఈ అవకాశం కల్పించింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 12 రాష్ట్రాలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగా ఇప్పుడు ఆరు రాష్ట్రాలకే ఈ అవకాశం దక్కింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు మార్కెట్‌ నుంచి అదనపు రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.కేంద్రం ప్రకటించిన ఆరు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌కి చోటు దక్కింది. 2021-22లో రూ. 3716 కోట్ల అప్పును ఏపీ ప్రభుత్వం తీసుకున్నది. ఇప్పుడు… 2022-23లో కేంద్రం కల్పించిన అవకాశంతో రూ. 5858 కోట్లు తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఏపీతోపాటు… అస్సాం, కేరళ, రాజస్థాన్‌, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌కి అదనపు రుణాలు పొందే అనుమతిని కేంద్రం కల్పించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరాలు పొందుపరిచారు. కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ రికమండేషన్‌తో రాష్ట్రాలు మార్కెట్‌ నుంచి అదనపు రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.