హైదరాబాదులో మరో మెట్రో కు పునాది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ (Hyderabad) ప్రజలకు శుభవార్త. నగరంలో  మరో మెట్రో రైలుకు పునాదిరాయి పడబోతోంది. రాయదుర్గం నుంచి శంషాబాద్‌కు వెళ్లే ఎయిర్‌పోర్టు మెట్రో (Airport Metro) ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.  ముఖ్యంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారితో పాటు  నగర శివారు నుంచి హైదరాబాద్‌లోకి వచ్చే వారికి.. ఈ ప్రాజెక్టుతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 31 కి.మీ. మేర నిర్మించే ఈ మెట్రో మార్గాన్ని.. మూడేళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. రిజర్వేషన్లు ప్రారంభం.. ఎయిర్‌పోర్టు మెట్రో రూట్ వివరాలు: మైండ్ స్పేస్ కూడలి నుంచి 0.9 దూరంలో రాయదుర్గం ఎయిర్‌పోర్టు స్టేషన్‌ నిర్మిస్తారు. అక్కడి నుంచి ఎయిర్‌పోర్టు మెట్రో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి బయోడైవర్సిటీ కూడలిలోని రెండు ఫ్లైఓవర్లను దాటుకొని.. నేరుగా ఖాజాగూడ చెరువు పక్క నుంచి వెళ్తుంది. ఖాజాగూడ వద్ద కుడి వైపునకు తిరిగి.. నానక్‌రామ్‌గూడ జంక్షన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు పక్క నుంచి నార్సింగి, అప్పా జంక్షన్, రాజేంద్రనగర్, శంషాబాద్, ఎయిర్‌పోర్టు కార్గో మీదుగా.. నేరుగా ఎయిర్‌పోర్టులోకి చేరుకునేలా అలైన్‌మెంట్ రూపొందించారు. ఎయిర్‌పోర్టు మెట్రో విశేషాలు: 31 కి.మీ. ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు రూ.6,250 కోట్లు అవసరమవుతాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఖర్చును భరిస్తుంది. హైదరాబాద్‌లో ఇప్పుడున్న మెట్రో ఆకాశమార్గంలో ఉన్నాయి. కానీ తొలిసారిగా అండర్‌గ్రౌండ్‌లో రైళ్లు నడవనున్నాయి. ఎయిర్‌పోర్టు సమీపంలో భూగర్భ మార్గాన్ని నిర్మించనున్నారు. మొత్తం 31 కి.మీ. మార్గంలో.. 27.5 కి.మీ. ఆకాశమార్గంలో ఉంటుంది. 1 కి.మీ. భూమార్గంలో అంటే.. రోడ్డు లెవెల్‌లో వెళ్తుంది. మరో 2.5 కి.మీ. మాత్రం అండర్ గ్రౌండ్‌లో ఉంటుంది. అభివృద్ధి చెందిన ప్రాంతాల్ని దృష్టిలో పెట్టుకుని స్టేషన్ల లొకేషన్లను ఫిక్స్ చేస్తారు. ఈ మార్గంలో 9 స్టేషన్‌లు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో స్కైవాకర్స్ నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న సిటీ మెట్రో 80 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్తున్నాయి. కానీ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్ మెట్రో రైల్ గరిష్టంగా 120 కిలో మీటర్ల వేగంతో వెళ్లేలా ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్‌లలో విమాన రాకపోకల సమాచారం తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేస్తారు. CISF పోలీసుల సహకారంతో ప్రయాణికుల లేగేజిని తనిఖీ చేసి.. ఆ తర్వాతే ఎయిర్‌పోర్టు లోపలికి పంపిస్తారు. ఎయిర్ పోర్టు మెట్రో పూర్తయితే.. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు 31 కి.మీ. దూరాన్ని 26 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రయాణ సమయంతో పాటు ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారికి ఖర్చు కూడా తగ్గుతుంది. అధునాతన సౌకర్యాలు: హైదరాబాద్‌లో ప్రస్తుతం నాగోల్-రాయదుర్గం, ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గాల్లో రైళ్లు నడుస్తున్నాయి ఐతే వీటికంటే అధునాతన సౌకర్యాలు ఎయిర్ పోర్టు మెట్రోలో ఉంటాయి. మెట్రో రైళ్లు వేగంగా వెళ్లేందుకు వీలుగా ఏరో డైనమిక్స్‌లో మార్పులు చేయనున్నారు. తేలికపాటి స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం కోచ్‌లను వినియోగిస్తారు. తద్వారా గంటకు 120 కి.మీ. వేగంతో వెళ్తాయి. ఇప్పుడున్న మెట్రోల్లో సీట్లు మెట్రో గోడలను ఆనుకొని..ఎదురెదురుగా కూర్చునేలా ఉంటాయి. కానీ ఎయిర్‌పోర్టు మెట్రోలో అలా ఉండవు. ఎక్కువ మంది కూర్చొని ప్రయాణించేలా ఛైర్ కార్ సీట్లు ఉంటాయి.

Leave A Reply

Your email address will not be published.