ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, అత్తమామలతో గడిపేందుకు రెండు రోజుల ప్రత్యేక సెలవును మంజూరు చేస్తూ అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబరులో రెండు రోజుల సాధారణ సెలవు ఇవ్వనున్నట్టు ఈ మేరకు అసోం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) గురువారం ప్రకటించింది. అయితే, తల్లిదండ్రులు, అత్తామామలు లేనివారికి ఇది వర్తించవని, వ్యక్తిగత సరదాలకు వీటిని ఉపయోగించరాదని కండిషన్లు పెట్టింది. వృద్ధ్యాపంలోని పెద్దలను గౌరవించడం కోసం, వారిపై శ్రద్ధ చూపడం కోసమే నవంబరు 6, 8 తేదీల్లో ఈ ప్రత్యేక సెలవులను మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది.నవంబర్‌ 7న ఛట్ పూజ, 9న రెండో శనివారం, 10న ఆదివారం కాగా.. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజుల ప్రత్యేక సెలవులు కలిసిరానున్నాయి. అత్యవసర విభాగాల్లో ఉన్నవారు మాత్రం ఈ ప్రత్యేక సెలవులను దశలవారీగా ఉపయోగించుకోవచ్చు. అయితే, ఉద్యోగులకు ప్రత్యేక సెలవులపై అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ మూడేగేళ్ల కిందటే ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, అత్తమామలతో సరదా గడిపేందుకు.. వారిపై శ్రద్ధ చూపడం కోసం రెండు రోజుల పాటు సెలవులు మంజూరు చేస్తామని 2021 పద్రాగస్టు ప్రసంగంలో హిమాంత బిశ్వశర్మ పేర్కొన్నారు.ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగులతో పాటు సాదారణ పౌరులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాల్లో ఉన్నవారు కుటుంబసభ్యులతో ముఖ్యంగా తల్లిదండ్రులకు పెద్దగా సమయం కేటాయించలేకపోతున్నారని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షనీయమని అంటున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రత్యేక సెలవులను ఉద్యోగులకు ఇవ్వలేదు. దేశంలోనే ఇదే తొలిసారి అని, మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు, సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సరదాగా తిరిగొస్తామంటే కుదరదని, తల్లిదండ్రులు లేదా అత్తమామాలతోనే గడపాలని స్పష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.