వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న పట్టభద్రులిచ్చిన తీర్పు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పట్టభద్రులిచ్చిన తీర్పు వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా..? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వైసీపీ నేతల గుసగుసలన్నీ ఎమ్మెల్సీ ఎన్నికలపైనే ఎందుకు జరిగాయి? అసెంబ్లీకి వచ్చిన సీఎం జగన్ తన చాంబర్‌లోనే ఎక్కువ సమయం గడపడానికి కారణం ఏమిటి? ఢిల్లీ (పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చిన సీఎం జగన్ తన చాంబర్‌లోనే ఎక్కువ సమయం గడిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీ లో కంటే లాబీల్లోనే ఎక్కువ సమయం గడిపారు. తొమ్మిది ఉమ్మడి జిల్లాలు, 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు లక్షల మంది ఓటర్లతో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావటాన్ని అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారాన్ని ఉపయోగించుకోవడం.. దొంగ ఓట్లు పోల్ చేయించుకోవడం.. ప్రలోభాలకు గురిచేసినప్పటికీ పట్టభద్రులు తమకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో అర్థంకాని పరిస్థితుల్లోకి వైసీపీ నేతలు జారిపోయారు. అయితే జగన్ మాత్రం ఐప్యాక్ ప్రతినిధులతో సమావేశమైనట్లు తెలుస్తోంది.కార్యనిర్వాహక కాపిటల్ అని చెప్పుతున్న విశాఖలో.. న్యాయ రాజధానిగా చెబుతున్న కర్నూలు లో సైకిల్ జోరుకు ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. తమ కంచుకోటలని విర్రవీగే ఏ నియోజకవర్గాల్లోనూ అధికారపార్టీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోలేకపోయింది. దీంతో పంక పార్టీలో పూర్తి నైరాశ్యం ఏర్పడింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడంతో తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు.. మంత్రులు ఈ ఫలితాలపైనే చర్చించుకుంటున్నారు. కొంతమంది మంత్రులు తమ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను సచివాలయంలోనే తమ ఛాంబర్‌లోకి పిలిపించుకుని లంచ్ తింటూ మంతనాలు జరిపారు. జగన్ శుక్రవారం ఢిల్లీ వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారు. శనివారం సీఎం అసెంబ్లీకి వచ్చారు. సభ జరుగుతున్నప్పటికీ ఎక్కువ సమయం ఛాంబర్‌లోనే గడిపారు. స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీలు నర్తు రామారావు, పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి, కౌరు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్ ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వద్దకు తీసుకువచ్చి ఫొటోలు తీయించుకున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఐప్యాక్ ప్రతినిధులతో జగన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఏపీలో ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది ఓటర్లు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓటమిపై జగన్ ఆరా తీశారు. ప్రభుత్వంపై వ్యతిరేకతా.. లేక స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులపై వ్యతిరేకత ఉందా అనే అంశంపై జగన్ అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో లోపాలున్నాయని , కొంతమంది ఎమ్మెల్యేలు చెబుతుండగా కొంతమంది మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకతే ఈ పరాజయానికి కారణమని బహిరంగానే చెబుతున్నారు. ఏపీలో గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మాత్రమే పట్టభద్రుల ఎన్నికలు జరగలేదు. మిగిలిన పట్టభద్రులంతా ఎన్నికల్లో పాల్గొన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని మాజీ మంత్రి ఒకరు విశ్లేషించారు. అందరు ఓటర్లనూ పట్టభద్రులు ప్రభావితం చేస్తారని అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏపీలో ఒక రకమైన భయంతో ప్రజలున్నారని, మాట్లాడేందుకు స్వేచ్ఛలేకపోవడం.. ఎడాపెడా పెడుతున్న కేసులు, పెరిగిన చార్జీలు, పన్నులు, ధరల భారం, ఉద్యోగాలు లేకపోవడం, ఉద్యోగుల్లో అసంతృప్తి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేవనే ఆందోళన వారిని వెంటాడిందని అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.వీటి ప్రభావమే ఎన్నికల్లో కనిపించిందని వివరించారు. ఐప్యాక్ బృందం జగన్‌కు ఏ నివేదిక ఇచ్చినా క్షేత్ర స్థాయిలో ఇవేనని అందరూ అంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినడం, నిర్మాణరంగం కుదేలయిన ప్రభావం కూడా అనేక వర్గాలపై చూపిస్తుందని అంటున్నారు. రాయలసీమ లో తమ పార్టీకి ఎదురైన ఫలితాలు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయని కూడా ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. కార్యనిర్వాహక రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మలేదు. న్యాయ రాజధాని అంటే రాయలసీమ వాళ్లు తిరస్కరించారు. అమరావతి పోయిందని కోస్తావాళ్లు కోపంగా ఉన్నారు. ఇక తమకు ఎవరు ఓటు వేస్తారని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యీ నవ్వుతూ సమాధానమిచ్చారు. పార్టీలో ఇకపై ఈ అంశాలపై పోస్టుమార్టం జరుగకపోతే భవిష్యత్తులో భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైసీపీ సీరియర్ నేత అన్నారు. కొందమంది నేతలు జగన్ వద్ద వాస్తవాలు దాస్తున్నారని అందుకే ఈ పరిస్థితులు వచ్చాయని ఆ సీనియర్ నేత చెప్పుకొచ్చారు. ఒకసారి వ్యతిరేకత మొదలైతే.. అది ఆగకపోగా పాతకస్థాయికి చేరుతుందనే విషయాన్ని ఇప్పటికైనా తమ నేతలు తెలుసుకోవాలని వైసీపీ ఎమ్మెల్యేలు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.