విమానం తలుపు తీసుకుని కిందకు దూకిన వ్యక్తి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కెనడాలోని టొరంటో విమానాశ్రయంలో ఈనెల 8 వ తేదీన ఈ షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్‌ కెనడాకు చెందిన బోయింగ్‌ 747 విమానం టొరంటో ఎయిర్‌పోర్ట్ నుంచి దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. రన్‌వేపై ఉన్న విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు ఒక్కసారిగా క్యాబిన్‌ తలుపు తెరిచాడు. అది గమనించేలోపే అందులో నుంచి కిందకు దూకేశాడు. ఈ ఆకస్మిక ఘటనతో ఆ విమానంలో ఉన్న ప్రయాణికులు, విమాన సిబ్బంది ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.అయితే విమానం రన్‌వేపై ఉన్నపుడు ఈ ఘటన జరగడంతో ఆ విమానంలోని ప్రయాణికులతోపాటు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. 20 అడుగుల ఎత్తు నుంచి ఆ ప్రయాణికుడు దూకడంతో తీవ్రంగా గాయపడినట్లు ఎయిర్‌ కెనడా అధికారులు తమ వెబ్‌సైట్‌లో తెలిపారు. అయితే ఆ వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు పేర్కొంది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఎలా ఉందో ఎయిర్ కెనడా వెల్లడించలేదు. అయితే అతడు ఎందుకు అలా ప్రవర్తించాడో అన్న విషయాన్ని తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు.మరోవైపు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న టొరంటో ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయగా.. వారు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి అనుకోని ఘటన చోటు చేసుకోవడంతో ఆ విమానం 6 గంటలు ఆలస్యంగా టొరంటో నుంచి దుబాయ్‌కి బయలుదేరింది. ఇక ఇటీవల ఎయిర్‌ కెనడా విమానంలో 16 ఏళ్ల కుర్రాడు వింతగా ప్రవర్తించిన ఘటన సంచలనంగా మారింది. తనతోపాటు ఉన్న తన కుటుంబ సభ్యులపైనే ఆ కుర్రాడు దాడికి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనలో గాయపడిన కుటుంబ సభ్యులను ఎయిర్ కెనడా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. విమానాల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Leave A Reply

Your email address will not be published.