మహానగరం లో గణనీయంగా తగ్గిన ఓటర్ల సంఖ్య

-   2022 తుది జాబితా ప్రకారం గ్రేటర్‌లో  89.34 లక్షల ఓటర్లు  -   తాజా జాబితా ప్రకారం 84.62 ఓటర్లు

 తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహానగర ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2022 తుది జాబితా ప్రకారం గ్రేటర్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధుల్లో 89.34 లక్షల ఓటర్లు ఉండగా.. కొత్తగా కొందరి పేర్లు చేరినా.. తుది జాబితాలో ఓటర్ల సంఖ్య తగ్గింది. జీహెచ్‌ఎంసీలో తాజా జాబితా ప్రకారం 84.62 ఓటర్లు ఉన్నారు. జిల్లాల వారీగా ఓటర్ల తుది జాబితాను ఎన్నికల అధికారులు గురువారం ప్రకటించారు. ఫొటో సిమిలర్‌ ఎంట్రీస్‌, చిరునామా మార్పు, డూప్లికేట్‌ ఓటర్లే ఓటర్ల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. నవంబర్‌ 9న ప్రకటించిన ముసాయిదా జాబితాతో పోలిస్తే ఓట్ల సంఖ్య పెరిగింది. ముసాయిదా జాబితా విడుదల చేసే నాటికే ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటరుగా నమోదై ఉన్న వారి పేర్లను తొలగించారు.హైదరాబాద్‌ జిల్లాలో అంతకుముందు 43.67 లక్షలుగా ఉన్న ఓటర్ల సంఖ్య ముసాయిదా జాబితా ప్రకారం 41.46 లక్షలకు తగ్గింది. గురువారం విడుదల చేసిన తుది జాబితా ప్రకారం జిల్లా ఓటర్ల సంఖ్య 42.15 లక్షలుగా ఉంది. 68 వేలకుపైగా ఓటర్లు కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నారు. 3 వేల మంది పేర్లు తొలగించారు. అత్యధికంగా కార్వాన్‌ నియోజకవర్గంలో 11,331 మంది, చాంద్రాయణగుట్టలో 10,513 మంది పేర్లు నమోదు చేసుకోగా.. అత్యల్పంగా కంటోన్మెంట్‌లో 758 మంది ఓటర్ల జాబితాలో చేరారు.

శివారు నియోజకవర్గాలో..

ఎప్పటిలానే శేరిలింగంపల్లిలో అత్యధికంగా 6,44,145 ఓటర్లున్నారు. 6,12,700 ఓట్లతో కుత్బుల్లాపుర్‌ రెండో స్థానంలో, 5,34,805 ఓటర్లతో ఎల్‌బీనర్‌ మూడో స్థానంలో ఉన్నాయి. అత్యల్పంగా చార్మినార్‌లో 2,14,774 మంది.. కంటోన్మెంట్‌లో 2,39,254 ఓటర్లున్నారు. కోర్‌ ఏరియాలో ఓటర్ల సంఖ్య 2.14 లక్షల నుంచి 3.32 లక్షల వరకు ఉండగా.. శివార్లలో మహేశ్వరం మినహా ఇతర నియోజకవర్గాల్లో 4.26 లక్షల నుంచి 6.44 లక్షల మంది ఓటర్లున్నారు. హైదరాబాద్‌లోని 15 నియోజకవర్గాల్లో 42.15 లక్షల మంది ఓటర్లు ఉండగా.. శివార్లలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధుల్లో 42.47 లక్షల మంది ఓటర్లు ఉండడం గమనార్హం. కోర్‌ ఏరియాలోని 15 నియోజకవర్గాల కంటే శివారు నియోజకవర్గాల్లో ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.