మునుగోడు ప్రజల తీర్పు చరిత్రలో నిలిచిపోవాలి

.. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు: ఉప ఎన్నికలో భాజపాకు ఓటు వేసి చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోరారు. మునుగోడు, మర్రిగూడ మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌పై యుద్ధం చేసే సమయం వచ్చిందని, రాజగోపాల్‌రెడ్డిని ఓడించేందుకు వంద మంది కౌరవులను ఇక్కడకు తీసుకువచ్చారని అన్నారు. కాంగ్రెస్‌లో 19మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12మందిని కొనుగోలు చేశారని, తాను అమ్ముడు పోయే వ్యక్తిని కానని అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వలె తాను దొంగచాటున అమ్ముడు పోలేదని.. గెలిచిన పార్టీని గౌరవించి ఆ పార్టీకి రాజీనామా చేసి రెండు లక్షల మంది ప్రజల సమక్షంలో భాజపాలో చేరినట్లుగా తెలిపారు. తాను ప్రజల కోసం రాజీనామా చేయడంతో 16 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, 15మంది ఎమ్మెల్సీలను ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పారు. కేసీఆర్‌ ఇచ్చే రూ.2వేల పింఛన్‌తో కారుకు ఓటు వేసి మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని, వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రాగానే నరేంద్రమోదీ నాయకత్వంలో ఒక్కొక్కరికి రూ.3వేల పింఛన్లు అందిస్తామని అన్నారు. ఇక్కడకు ప్రచారానికి వచ్చే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు మాట్లాడే ధైర్యం లేదని, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కేవలం కల్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చేందుకు మాత్రమే పనికి వస్తాడని అన్నారు. గ్రామాల్లో తెరాసకు ఓట్లు వేయించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు లక్ష్యాలు పెట్టారని, దాన్ని చేరకుంటే ఎమ్మెల్యే టిక్కెట్‌ దక్కదని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆయా కార్యక్రమాల్లో కరీంనగర్‌ జడ్పీ మాజీ అధ్యక్షురాలు తుల ఉమ, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, నాయకులు సాగర్ల లింగస్వామి, పందుల భాస్కర్‌, జిట్టగోని యాదగిరి, జక్కల శ్రీను, జిట్టగోని సైదులు, యాస అమరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.