మునుగోడు తీర్పు ఆ రెండు పార్టీలకు మరణ శాసనం

.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల్లో వచ్చే తీర్పు తెలంగాణను ముంచిన, దోచుకున్న టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు మరణశాసనం కాబోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా బుధవారం మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ఒక పార్టీ మందును నమ్ముకుంది, మరో పార్టీ పైసలను నమ్ముకుంది, మేము మాత్రం ప్రజలను నమ్ముకున్నామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. “ఈ ఉప ఎన్నిక మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి రాలే.. దళితులకు మూడెకరాల భూమి కోసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం, రైతు రుణ మాఫీ కోసం రాలే.. ఇంటింటికో ఉద్యోగం కోసం రాలే.. ఇక్కడి ఎమ్మెల్యే చచ్చిపోతే రాలే.. వచ్చిన ఓట్లను ఇక్కడి ఎమ్మెల్యే వేల కోట్లకు అమ్ముకుంటే ఈ ఉప ఎన్నిక వచ్చింది” అన్నారు.
రాజీనామా చేస్తే మునుగోడు అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు వస్తాయని ప్రచారం చేశారు. కానీ కిష్టాపురం గ్రామానికి చిల్లిగవ్వ రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదు. కానీ చీకటి పడితే సీసాలు దిగుతున్నాయి. ఛాయ్ తాగాల్సినోళ్లు మందు తాగుతున్నారు. 12, 14 ఏళ్ల పిల్లలు కూడా మద్యం తాగి, గోడలు పట్టుకుని నడిచే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు పోటీలో ఉన్నోళ్లు కొత్తవారేం కాదు. 2014లో పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, 2018లో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి. ఒకనికి నియోజకవర్గంలో ఊరు లేదు, మరొకనికి నోరు తిరగదు. ‘సీసా కొత్తది.. సారా మాత్రం పాతదే’నని ఎద్దేవా చేశారు.
దుబ్బాక, హుజురాబాద్, నాగార్జునసాగర్, హుజుర్ నగర్ లలో ఉప ఎన్నికలు జరిగాయి. కానీ ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎక్కడ వేసి గొంగళి అక్కడే మాదిరిగా ఉంది. మాలాగా మోసం పోకండి అంటూ ఆ నియోజకవర్గ ప్రజలు ఇక్కడ ఫ్లేక్సీలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఆయన మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కొండా లక్ష్మణ్, దర్మభిక్షం లాంటి త్యాగమూర్తులు ఈ ప్రాంతం నుంచి గెలిచారు. ఇప్పుడు మాత్రం పనికిరాని వాళ్లు బరిలో ఉన్నారు. రాష్ట్రంలో నాలుగు ఉప ఎన్నికలు జరిగితే రెండు సార్లు బీజేపీకి, రెండు సార్లే టీఆర్ఎస్ పార్టీలకు అవకాశమిచ్చారు. ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశమివ్వండి. సోనియాగాంధీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మునుగోడు ఆడబిడ్డ స్రవంతికి టికెట్ ఇచ్చారు. ఈ ప్రాంతంలో బడైనా, గుడైనా కట్టించి అభివృద్ధి చేసిన పాల్వయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ స్రవంతి. మునుగోడు నియోజకవర్గంలో 12 సార్లు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారిగా కూడా మహిళా అభ్యర్థి గెలువలేదని, ఈసారి పాల్వాయి స్రవంతికి మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు. స్రవంతి అసెంబ్లీ మునుగోడు సమస్యలపై కోట్లాడుతుందని అప్పుడు నియోజకవర్గానికి నిధులు, కృష్ణా జలాలు వస్తాయి అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.