తమ వారసులకు టికెట్ ఇవ్వాలని సీఎం ముందు నేతల ప్రపోజల్స్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అత్యంత సీనియర్లుగా బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు లీడర్ల వారసులకు ఈసారి కూడా అసెంబ్లీ టికెట్లు దక్కేలా లేవు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తమ తనయులకు టికెట్లు ఇవ్వాలని 2018 నుంచి ప్రస్తుత సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ లు సీఎం కేసీఆర్ కు మొర పెట్టుకున్నారు. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో వారిని బరిలో ఉండాలని వారి వారసులకు పదవులు ఇస్తామని సీఎం కేసీఆర్ ఆనాడు బుజ్జగించిన విషయం తెల్సిందే. దాని ప్రకారమే ఉమ్మడి డీసీసీబీ చైర్మన్ గా పోచారం తనయుడు పోచారం భాస్కర్ రెడ్డికి పదవిని అప్పగించగా, బాజిరెడ్డి గోవర్ధన్ తన తనయుడికి జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని అడిగిన జడ్పీటీసీతోనే సరిపెట్టారు.

నాడు ఉద్యమకారులకు పదవులు ఇవ్వాలన్న

యోచనలో విఠల్ రావుకు జడ్పీ చైర్మన్ పదవి దక్కింది. దానితో నిరాశలో ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ కు ఆర్టీసీ చైర్మన్ పదవిని అప్పగించారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరు సీనియర్ నాయకులు మరోసారి పాత ప్రతిపాదనే సీఎం కేసీఆర్ కు విన్నవించినట్టు తెలిసింది. బాన్సువాడ నుంచి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డికి, నిజామాబాద్ రూరల్ నుంచి బాజిరెడ్డి జగన్ కు టికెట్ ఇవ్వాలని ఇద్దరు లీడర్లు మరోసారి కేసీఆర్ కు మొర పెట్టుకున్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి అంతా. ఆశాజనకంగా లేకపోవడం, సర్వేలలో కొద్దోగొప్పగా సిట్టింగ్లకే అనుకూలంగా ఉండటంతో కేసీఆర్ ఈసారి వారసులకు టికెట్లు ఇచ్చే యోచనను పక్కన పెట్టినట్లు తెలిసింది. సీనియర్లను కాదని కొత్త వారికి అవకాశం ఇస్తే సంబంధిత సీట్లు ప్రతిపక్షం ఖాతాలో పడడం ఖాయమన్నది తేటతెల్లమైనట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆదేశాల మేరకు

నిర్వహించిన సర్వేల్లోనూ ఇదే అంశం స్పష్టమైనట్లు తెలిసింది. మొన్నటి వరకు బీజేపీతో పోటీ పడిన బీఆర్ఎస్కు ఇటీవల కన్నడనాట వచ్చిన ఫలితాలు జోష్ నింపడంతో పాటు కాంగ్రెస్ నుంచి బరిలోకి దించే వారు సీనియర్లు ఉండటంతో వారికే అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రిస్క్ తీసుకోకుండా సిట్టింగ్ లకే దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో బీఆర్ ఎస్ తరపున ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్ లను మించిన సీనియర్లు ఆ పార్టీలో లేరు. దాంతో వారి స్థానాలను ఇతరులతో భర్తీ చేయడం సాధ్యం కాదని ఒకవేళ వారు పోటీ చేయకపోతే పార్టీకి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పార్టీ అధినేత చేయించిన సర్వేల్లోనూ, క్యాడర్ లో ఉన్న సానుభూతిని సొమ్ము చేసుకుంటూ సీనియర్లనే బరిలో నిలపాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
శ్రావణమాసంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెలువడే తొలి జాబితాలో సీనియర్లు అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాజిరెడ్డి పేర్లే తొలుత వస్తాయని చర్చ జరుగుతుంది. అందుకనుగుణంగానే గత కాలంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డి గాని బాజిరెడ్డి గోవర్ధన్ లు కూడా వచ్చే ఎన్నికల్లో తామే బరిలో ఉంటానని చెప్పకనే చెప్పుకొచ్చారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వారే బరిలో ఉంటారని, వారి వారసులకు వచ్చే ప్రభుత్వ హయంలో పదవులు ఇస్తామన్న హామీ లభించిందని చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పాటు కోసం ఒక్క సీటును కూడా వదులుకోలేకుండా గెలుపు తీరాలకు చేరేందుకు సీఎం కేసీఆర్ ఈసారి సిట్టింగ్ లతో పాటు సీనియర్లకే ప్రాధాన్యత ఇవ్వనున్నారని రెండు, మూడు రోజుల్లో వెలువడే మొదటి జాబితాలో ఉంటాయని పార్టీ వర్గాలు సీనియర్ల పేర్లే ఉంటాయని చెబుతున్నాయి. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచి గెలవడం ద్వారా అసెంబ్లీలో అధ్యక్ష అనాలనుకున్నా పోచారం, బాజిరెడ్డి వారసులకు మరికొంత కాలం ఎదురు చూపులు తప్పేలా లేవు.

Leave A Reply

Your email address will not be published.