ఖండాంతరాలు దాటనున్న పుట్టపాక చేనేత కళాకారుల ఖ్యాతి

- ఫ్రాన్స్‌ ప్రథమ పౌరురాలు బ్రిగిట్టే మెక్రాన్‌కు దుబీయన్‌ చీరను బహూకరించిన ప్రధాని మోదీ - 100 ఏండ్లుగా తేలియా రుమాలు తయారు చేస్తున్న కళాకారులు - రెండు పద్మశ్రీలతోపాటు పలు జాతీయ అవార్డులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పుట్టపాక తేలియా రుమాలును ఇక ప్రపంచం మొత్తం ఘనంగా కీర్తించనున్నది. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీలోని గురుగ్రామ్‌లో జరిగే జీ-20 సమావేశాల్లో భారతీయ హస్తకళల ప్రదర్శనలో భాగంగా పుట్టపాక చేనేత కళాకారులు తయారు చేసిన తేలియా రుమాలును ప్రదర్శించనుండడంతో పుట్టపాక చేనేత కళాకారుల ఖ్యాతి ఖండాంతరాలు దాటనున్నది. ఇటీవల భారత ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ దేశ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడి భార్య బ్రిగిట్టే మెక్రాన్‌కు పుట్టపాక చేనేత కళాకారుల తయారు చేసిన దుబీయన్‌ చీరెను బహూకరించడంతో పుట్టపాక ఖ్యాతి ఖండాంతరాలకు చేరింది. పుట్టపాక చేనేత కళాకారులు తయరు చేసిన తేలియా రుమాలు, డబుల్‌ ఇక్కత్‌ చీరె, డబుల్‌ ఇక్కత్‌ డాబిబోన్‌ చీరె, డబుల్‌ ఇక్కత్‌ డాబిబోన్‌ దుబ్బటి తదితర వస్ర్తాలను ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆకర్షిస్తున్నాయి. పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యానికి వారిని ఇప్పటికే రెండు పద్మశ్రీ అవార్డులతోపాటు పలు జాతీయ అవార్డులు వరించాయి.

శీతాకాలం వేడిగాఎండాకాలం చల్లగా ఉండే రుమాలు..

మండుటెండల్లో సైతం చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండే తేలియా రుమాలు తయారీ చాలా ప్రత్యేకమైనది. ఈ రుమాలులో వాడే రంగులన్నీ ప్రకృతి సిద్ధంగా లభించేవే. ఆముదపు పొట్టును కాల్చినప్పుడు వచ్చే బూడిదను, వృక్ష సంబంధ రంగులతోపాటు ఆముదం లేదా నువ్వుల నూనెను సూర్యరశ్మి ద్వారా వేడైన నీటిలో కలిపి నూలును అందుతో నానబెడుతారు. అలా నానబెట్టిన నూలును కనీసం 20రోజులపాటు రోజుకు రెండు పూటలా చేతులతో పిసుకుతారు. తరువాత నూలును పిండి ఆరబెడతారు. ఆరిన తరువాత మళ్లీ నీటిలో నానబెడతారు. ఇలా 20రోజులపాటు చేయడం ద్వారా దారాల్లోకి నూనె ఇంకి రంగులు చక్కగా అంటుకుంటాయి.

పటిక, కరక్కాయ, హీరాకాసు తో ఎరుపు, నీలం, పసుపు మొదలైన రంగులన్నీ చెట్ల నుంచి తయారు చేస్తారు. నూనెలు, సహజసిద్ధ రంగులు వాడడం మూలంగా తేలియా రుమాలుకు ఔషధ గుణాలు అందుతాయి కాబట్టే వేసవి తాపం తప్పించి చల్లదనాన్ని అందిస్తుంది. ఉష్ణోగ్రత అధికంగా ఉండే గల్ఫ్‌ ప్రాంతాల్లో ఉండేవారు ప్రత్యేకంగా తేలియా రుమాలును కొనుగోలు చేస్తుంటారు. ఈ రుమాలు డిజైన్లను బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఖరీదు ఉంటుంది. పుట్టపాక తేలియా రుమాలు ఇక్కడి నుంచి ముంబాయి, జర్మనీ, జపాన్‌, సింగపూర్‌, అమెరికా, నెదర్లాండ్‌, గుజరాత్‌, చెన్నై, సోలాపూర్‌, కోల్‌కతా, అతరబ్‌ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి.

దుబీయన్‌ వస్త్రం పుట్టపాక సొంతం..

దుబీయన్‌ వస్త్రం డిజైన్‌ పుట్టపాక చేనేత కళాకారుల సొంతం. ప్రపంచ వ్యాప్తంగా దుబీయన్‌ వస్త్రం డిజైన్‌ ఎక్కడ కూడా కనిపించదు. పుట్టపాక చేనేత కళాకారులు మాత్రమే ఈ వస్త్రం డిజైన్‌ చేస్తారు. ఈ వస్త్రం తయారీలో నిలువు ఇక్కత్‌ విధానం పాటిస్తారు. అలాగే డిజైన్‌ కూడా నిలువు ఇక్కత్‌లోనే రూపొందిస్తారు. ఈ వస్త్రం తయారీలో వాడే దారాలు పలుచగా ఉంటాయి. ఈ వస్త్రంతో ప్యాబ్రిక్‌ దుస్తులు తయారు చేస్తారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడి భార్య బ్రిగిట్టే మెక్రాన్‌కు దుబీయన్‌ చీరెను బహూకరించడంతో పుట్టపాక ఖ్యాతి ఖండాంతరాలకు చేరింది.

గర్వంగా ఉంది :చేనేత కళాకారుడు కొలను రవీందర్‌

నేను చిన్నతనం నుంచి చదువుకుంటూనే మా నాన్న దగ్గర డిజైన్లు, మగ్గం పని, తేలియా రుమాలు తయరు చేయడం నేర్చుకున్నా. అందరు రసాయన రంగులు వాడి తయారు చేస్తే మేము ప్రకృతి సిద్ధంగా లభించే రంగులను వాడి తేలియా రుమాలును తయారు చేస్తాం. పుట్టపాక చేనేత కళాకారులు తయారు చేసిన తేలియా రుమాలును జీ-20 ప్రదర్శనలో ఉంచడం గర్వంగా ఉంది.

Leave A Reply

Your email address will not be published.