విజ్ఞాన రంగంలో మహిళల పాత్ర పెరగాలి

- మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి 

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సైన్స్ రంగంలో మహిళలు ఎక్కువ సంఖ్యలో రావాలని అప్పుడే మరిన్ని పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి అన్నారు. గతంలో తల్లిదండ్రులు తమ కూతుళ్ళకు భాష, సాహిత్యం, లలిత కళలు, సామాజిక శాస్త్రం, చదువు అనంతరం పెళ్లి వంటి విషయాలలో మాత్రమే ఉండేలా చూసేవారని అన్నారు. సైన్స్, టెక్నాలజీలు ఆడపిల్లలకు ఎందుకులే అనే భావం ఉండేదని క్రమంగా కొంత మార్పు వచ్చిందని ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సైన్స్ రంగంలో వారి పాత్ర పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలను విజ్ఞాన రంగంవైపు ఆకర్షించే భాగంగానే తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్, విజ్ఞాన దర్శిని ఎన్జీఓ సంయుక్తంగా ‘ విజ్ఞాన రంగంలో మహిళల పాత్ర ‘ అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కాలేజీలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా చైర్ పర్సన్ సునితా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, పరిశోధనల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే శాస్త్ర, సాంకేతిక రంగం మరింత అభివృద్ధి చెంది కొత్త ఆవిష్కరణలు సమాజానికి అందుతాయని అన్నారు. మన దేశంలో కూడా తొలితరానికి చెందిన మహిళా శాస్త్రవేత్తల గురించి తెల్సుకోవాల్సిన అవసరమెంతైనా వుందన్నారు. తొలి తరం మహిళలను స్ఫూర్తిగా తీసుకొని ఈ శతాబ్దం మహిళలు ఇంకనూ సైన్స్ రంగంలో పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (ఎన్సిఎస్టిసి) 1987 ఫిబ్రవరి 28న మొదటిసారి ‘నేషనల్ సైన్స్ డే’ని ప్రకటించిందని, ఆనాటి నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం పాటించడం జరుగుతోందని తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మహిళా శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులకు వివిధ కెరీర్ అవకాశాలను అందించడానికి ‘నాలెడ్జ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రీసెర్చ్ అడ్వాన్స్మెంట్ త్రూ నర్చరింగ్ (కిరాన్)’ పథకాన్ని అమలు చేస్తోందని తద్వారా మహిళా శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు. పరిశోధన సౌకర్యాలను మెరుగుపరచడానికి మహిళా విశ్వవిద్యాలయాలకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేక చొరవ  తీసుకుందన్నారు. ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో లబ్ధిదారుల విశ్వవిద్యాలయాలలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. విద్యార్థినులు మహిళా చట్టాలపై అవగాహన కల్పించుకోవలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షి టీమ్స్, భరోసా సెంటర్స్, సఖి సెంటర్స్ ఏర్పాటు చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారని చైర్ పర్సన్ గుర్తుచేశారు. విద్యార్థులందరూ చదువుపై దృష్టి సాధించి సమాజంలో మంచి స్థాయికి రావాలని సూచించారు. విద్యార్థినులకు ఎలాంటి సమస్య వచ్చిన తక్షణమే మహిళా కమిషన్ దృష్టికి తీసుకురావాలని అప్పుడే మహిళా కమిషన్ మీకు సత్పర న్యాయం అందేలా చూస్తుందని అన్నారు. మీకు ఏ సమస్య వచ్చినా 100, 181 లేదా మహిళా కమిషన్ వాట్సప్ హెల్ప్ లైన్ 9490555533 ఫోన్ చేయవచ్చని మీకు అన్నివిధాల మహిళా కమిషన్ అండగా ఉంటుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.