సచివాలయ భవనం ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నూతన సచివాలయ భవనం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపొందుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం.. రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల త్యాగఫలితమేనని పేర్కొన్నారు. ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా నిర్మిస్తున్నామని వెల్లడించారు. నిర్మాణం తుది దశకు చేరుకొన్న సచివాలయ భవనాన్ని సీఎం కేసీఆర్‌ గురువారం పరిశీలించారు.

ప్రధాన ద్వారం దగ్గర నుంచి పై అంతస్తువరకు అణువణువూ పరిశీలించి.. వర్క్ ఏజెన్సీలకు, ఇంజినీర్లకు సూచనలు చేసారు. ప్రధాన ద్వారం ఎలివేషన్‌, ఇటీవల బిగించిన డోమ్‌లు, ధోల్‌పూర్‌ స్టోన్‌తో రూపొందించిన వాల్‌క్లాడింగ్‌, ఉత్తర దక్షిణ భాగాల్లో ఏర్పాటుచేసిన ప్రవేశ ద్వారాలు, ప్రహరీలు, వాటికి అమరుస్తున్న రెయిలింగ్‌, సుందరంగా రూపుదిద్దుకొంటున్న వాటర్‌ ఫౌంటెయిన్లు, లాన్‌లు, స్టెయిర్‌కేస్‌లు, సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకుల ప్రవేశ ద్వారాలు, పార్కింగ్‌ స్థలాలను సీఎం క్షుణ్ణంగా పరిశీలించారు.

 

.. సకల సౌకర్యాలు
కొత్త సచివాలయంలో పరిపాలనకు అవసరమైన సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఆహ్లాదకర వాతావరణాన్ని పంచుతూ, సమర్థ పనితీరును కనబరిచేలా మంత్రులు, ఉన్నతాధికారుల చాంబర్లు నిర్మితమవుతున్నాయని చెప్పారు. క్యాంటీన్లు, సమావేశ మందిరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. సచివాలయం ప్రాంగణంలో హెలిప్యాడ్‌ కోసం స్థలాన్ని పరిశీలించారు. సిబ్బందికి, సందర్శకులకు అసౌకర్యం కలగకుండా అన్నిచోట్లా లిఫ్టుల నిర్మాణం చేపట్టడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. సెక్యూరిటీ సిబ్బంది కార్యాలయాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, రికార్డులను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూంల నిర్మాణం, జాతీయ, అంతర్జాతీయ అతిథుల కోసం నిర్మించిన సమావేశ మందిరాలను సీఎం పరిశీలించారు. గత వంద ఏండ్లలో ఇంతపెద్ద మొత్తంలో ధోల్‌పూర్‌ స్టోన్‌ను వాడిన కట్టడం దేశంలో తెలంగాణ సచివాలయమేనని తెలిపారు. పార్లమెంటు భవనం తరహాలో సచివాలయం లోపల, బయట అమర్చుతున్న టెర్రాకోట వాల్‌ క్లాడింగ్‌ను పరిశీలించారు. సుందరీకరణ, అంతర్గత ఫర్నిచర్‌ తదితర అంశాలపై నిర్మాణ ఏజెన్సీ, ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రగతిభవన్‌లో ఏర్పాటుచేసిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా సీఎం పరిశీలించారు.

  • సచివాలయం చుట్టూ త్యాగధనుల స్ఫూర్తి
    సచివాలయ నిర్మాణ కౌశలాన్ని, ఉద్దేశాన్ని సీఎం కేసీఆర్‌ వివరించారు. ‘తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరులను నిత్యం స్మరించుకొనేలా సచివాలయానికి ఎదురుగా అమరవీరుల స్మృతి చిహ్నం నిర్మితమవుతున్నది. బీఆర్‌ అంబేద్కర్‌ పేరును సార్థకం చేసేలా సచివాలయానికి ఆయన పేరు పెట్టుకొన్నాం. సచివాలయం పక్కనే నిర్మాణమవుతున్న అత్యంత ఎత్తయిన అంబేద్కర్‌ విగ్రహం.. ప్రజా ప్రతినిధులకు, అధికారులకు ఎప్పటికప్పడు తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సచివాలయం నిర్మాణమవుతున్నది’ అని పేర్కొన్నారు.

సీఎం వెంట మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాల సుమన్‌, దానం నాగేందర్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, బండా శ్రీనివాస్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ప్రియాంకా వర్గీస్‌, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్‌ తేజ, ఆర్‌అండ్‌బీ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఈఎన్సీ రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, పల్లె రవికుమార్‌గౌడ్‌, ఆంజనేయులుగౌడ్‌, వర్క్ ఏజెన్సీల ఇంజినీర్లు, ఆర్‌అండ్‌బీ అధికారులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.